5న నీలకంఠేశ్వరుడి మహా రథోత్సవం
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలో జనవరి 5న నీలకంఠుడి మహారథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మాచాని నీల మురళీధర్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తేరు బజారులోని రథశాలలో ప్రత్యేక పూజలు చేశారు. మహారథాన్ని వెలుపలికి తీశారు. ఈసందర్భంగా ధర్మకర్త మాట్లాడుతూ.. జనవరి 3వ తేదీ రాత్రి 9 నుంచి 12గంటల వరకు శ్రీ పార్వతి పరమేశ్వరస్వామి స్వామి కల్యాణోత్సవం, 4న రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ప్రభావళి మహోత్సవం, 5న సాయంత్రం 4 నుంచి 6గంటల వరకు మహారథోత్సవం ఉంటుందన్నారు. అలాగే 6న వ్యాహవళి మహోత్సవం, 7న సాయంత్రం 5గంటల నుండి రాత్రి 9గంటల వరకు తీర్థావళీ వసంతోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు మాచాని శివశంకర్, శివకేశవ, మున్సిపల్ కౌన్సిలర్లు కామర్తినాగేషప్ప, ఎంకె శివకుమార్, చంద్రశేఖర్, కుర్ణికుల సంఘ పెద్దలు పాల్గొన్నారు.
ముఖం కడుక్కుని వెళ్లండి
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ అమలు చేస్తున్న స్టాప్.. వాష్ అండ్ గో కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం కొనసాగుతోంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పోలీసులు జిల్లా అంతటా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆగండి.. ముఖం కడుక్కోండి.. నిద్రమత్తు తగ్గుతుంది.. తర్వాత ముందుకెళ్లండి.. అంటూ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. వాహన రికార్డులు, డ్రైవర్ లైసెన్స్‌తో పాటు వాహన భద్రతా ప్రమాణాలను కూడా పరిశీలించారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారుల్లో లారీలు, ప్రైవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, మినీ వ్యాన్‌లు, లగేజీ బొలెరో వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
5న నీలకంఠేశ్వరుడి మహా రథోత్సవం


