అవయవదానంతో ఆయువు పోద్దాం
తనూజారెడ్డి అవయవదానం
ఇతరుల జీవితాల్లో
ఆమె భాగ్యవంతురాలు
మద్దికెరకు చెందిన కాంట్రాక్టర్ శంకర్‌రెడ్డి, పద్మావతిల కుమార్తె తనూజారెడ్డి ఎం. ఫార్మసి పూర్తి చేశారు. 12 ఏళ్ల క్రితం వివాహమైన కొన్నాళ్లకు ఇంటి మిద్దైపె వాకింగ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆమెకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొంత సమయం వరకు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో బ్రెయిన్‌డెడ్ అయ్యింది. 2014 డిసెంబర్ 18న ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చారు. ఇలా ఆమె ఇతరుల్లోనూ ఇప్పటికీ జీవిస్తోంది. ఆమె పేరుతో కుటుంబసభ్యులు హొళగుందలో ఒక డిగ్రీ కాలేజీని కొనసాగిస్తున్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని కొత్తపేటకు చెందిన భాగ్యమ్మ(50) భర్త సామేలు పదిహేనేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఆమె పెంచి ప్రయోజకులను చేశారు. గత అక్టోబర్ నెల 18వ తేదీ రాత్రి ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చి, మెదడులో రక్తస్రావం అయ్యింది. శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె అదే నెల 21న బ్రెయిన్ డెడ్ అయ్యింది. జీవన్‌దాన్ ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె ఒక కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన ఆసుపత్రులకు తరలించారు. తాను మరణించి కూడా ఇతరు జీవితాల్లో ఆమె వెలుగులు పంచింది.
నంద్యాల జిల్లా గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్రగౌడ్ కుమార్తె సుజాత(31) గోస్పాడు మండలం తేల్లపురి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించేవారు. ఆమె గత మే 28న విధి నిర్వహణకు స్కూటీపై వెళ్తూ గోస్పాడు మండలం తెల్లపురి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయమైన ఆమెకు నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆమె కోలుకోలేక బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాన్ ట్రస్ట్ సభ్యుల అవగాహనతో కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకువచ్చారు. దీంతో ఆమె ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లు దానం చేశారు.
కర్నూలుకు చెందిన పావనీలతకు నాలుగేళ్ల క్రితం భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నీ సమస్యతో మృతి చెందాడు.. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఆమె హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ ప్రయత్నాల్లో ఉండగా గత సంవత్సరం ఫిబ్రవరి 2న ఫిట్స్ రావడంతో మెదడు దెబ్బతినింది. ఆ మరుసటి రోజు ఆమెను కుటుంబసభ్యులు తీసుకొచ్చి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించగా వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్‌దాన్ ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ఆమెలోని కాలేయాన్ని, కిడ్నీలను, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన ఆసుపత్రులకు పంపించారు.
కర్నూలు(హాస్పిటల్): అవయవదానం చేయడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. కనీసం కళ్లను దానం చేయాలన్నా వెనుకాడుతున్నారు. అంతెందుకు ప్రాణాలతో విలవిలాడుతున్న వ్యక్తికి రక్తం ఇవ్వాలన్నా సమీప బంధువులు సైతం వెనుకాడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అవయవదానంపై జీవన్‌దాన్ ట్రస్ట్ విస్తృత ప్రచారం కల్పించింది. ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులను కలిసి అవయవదానం గురించి అవగాహన కల్పించి ఒప్పిస్తున్నారు. ఫలితంగా అవయవదానం చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. కొన్నేళ్లుగా నేత్రదానం, రక్తదానం చేసేందుకు సైతం దాతలు విరివిగా ముందుకు వస్తున్నారు. మనిషి బతికున్నప్పుడు అవయవాలు సేకరించరని, బ్రెయిన్‌డెడ్ దశలో మాత్రమే వాటిని సేకరిస్తారని వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. అవయవదానంకు అనుగుణంగా అవయవాలను సేకరించేందుకు, మార్చేందుకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు కిమ్స్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్‌లకు అనుమతి లభించింది. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అవయవదాన, మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు.
మరణించాకే అవయవాల సేకరణ
మృతిచెందిన, బ్రెయిన్‌డెడ్ వ్యక్తుల నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. కానీ ఇప్పటికీ చాలా మందికి బతికున్నప్పుడు అవయవాలను సేకరిస్తారనే అపోహ ఉంది. ఇది తప్పు అని జీవన్‌దాన్ ట్రస్ట్ ప్రతినిధులు ఆయా ఆసుపత్రుల్లో బ్రెయిన్‌డెడ్ అయిన వారికి వివరిస్తున్నారు. సేకరించిన అవయవాలను ఇతరులకు అమరిస్తే వేరొకరి శరీరం ద్వారా ఈ ప్రపంచంలో జీవించే అవకాశం మళ్లీ లభిస్తుంది. అంధులుగా పుట్టేవారికి దాతల నుంచి సేకరించిన నేత్రాలను అమరిస్తే వారు మళ్లీ ఈ లోకాన్ని చూడగలుగుతారు. ఏదైనా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, కొన్ని వ్యాధులకు చికిత్స పొందుతూ బ్రెయిడ్ డెడ్ అయి ఉన్న వారి అవయవాలను ఇతరులకు అమర్చేందుకు సేకరిస్తారు.
ఎనిమిది మందికి పునర్జన్మ
అవయవదానానికి అంగీకరించిన వ్యక్తి నుంచి గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్(క్లోమగ్రంధి), ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, చర్మం టిష్యూ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్, కళ్లు, ఎముకలో మూలిగను ఇతరులకు అమర్చే అవకాశం ఉంది. ఒక కిడ్నీ, కాలేయంలో కొంత భాగం, కొద్దిగా ఎముక మజ్జను బతికుండగానే దగ్గరి వారి కోసం దానం చేయవచ్చు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబసభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో 8 మందికి ఊపిరిపోసే వీలుంది.
ఇతరులకు శ్వాస ఇచ్చిన పావనీలత
ఒకరి అవయవ దానంతో
8 మందికి ప్రాణం
ముందుకు వస్తున్న జనం
బ్రెయిన్ డెడ్ తర్వాతే
అవయవాల సేకరణ
కర్నూలు జీజీహెచ్, రెండు ప్రైవేటు
ఆసుపత్రులకు అవయవ మార్పిడికి
అనుమతి
జీవన్‌దాన్ ట్రస్ట్ చొరవతో
చురుగ్గా కార్యక్రమం
అవయవదానంతో ఆయువు పోద్దాం
అవయవదానంతో ఆయువు పోద్దాం
అవయవదానంతో ఆయువు పోద్దాం
అవయవదానంతో ఆయువు పోద్దాం


