అత్యాచార బాధిత కుటుంబాలకు త్వరితగతిన పరిహారం
కర్నూలు(సెంట్రల్): ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధిత కుటుంబాలకు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జేసీ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రతినెలా సివిల్ రైట్ డేను నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆర్‌డీఓలను ఆదేశించారు. డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ 2013 నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో పెండింగ్ విచారణలను త్వరగా పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టానికి సంబంధించి పెండింగ్‌లోని ఉద్యోగ నియామకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. 2025 అక్టోబర్ 3న జరిగిన మానిటరింగ్ కమిటీ సమావేశంలో డీవీఎంసీ సభ్యులు ప్రస్తావించిన అంశాలపై అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికార అధికారి బి.రాధిక వివరించారు. డీవీఎంసీ సభ్యుడు సురేంద్ర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బాలికల హాస్టళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి స్టేషన్‌లో నమోదయ్యే ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల వివరాలను సభ్యులకు అందజేయాలని కోరారు. మరో సభ్యుడు మాలతి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ భవన్ మరమ్మతులకు ఎంపీ కేటాయించిన నిధులను వినియోగించుకుని పూర్తి చేయాలన్నారు. మరో సభ్యుడు వెంకట నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లోని వితంతువు పెన్షన్లను మంజూరు చేయించాలన్నారు. సమావేశంలో ఆర్‌డీఓ సందీప్‌కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, డీవీఎంసీ సభ్యులు మధు, వెంకట నాగరాజు యాదవ్ పాల్గొన్నారు.


