క్లస్టర్ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య డాక్టర్ వెంకట బసవరావు, రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్‌లు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీ అనుబంధంగా ఉన్న మూడు కాలేజీలకు చెందిన విద్యార్థులకు గత నెలలో పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో మూడవ సెమిస్టర్ పరీక్షలకు 866 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 617 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 71.25 ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. ఐదవ సెమిస్టర్ పరీక్షలకు 804 మంది పరీక్షలకు హాజరు కాగా 709 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ పరీక్షల విభాగం డీన్ డాక్టర్ నాగరాజు శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.బాల సుబ్రమణ్యం పాల్గొన్నారు.
నేడు కర్నూలుకు ఏపీఎన్‌జీజీవోస్ నేతల రాక
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎన్‌జీజీఓస్ అసోసియేషన్ నాయకులు గురువారం కర్నూలుకు రానున్నారు. జిల్లా శాఖకు నూతన కార్యవర్గ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రెండు గ్రూపుల మధ్య విభేదాలు ఉండటంతో ఎన్నికలు జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాకు అడ్‌హాక్ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 11 మందితో అడ్‌హాక్ కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఎన్‌జీజీవోస్ నేతల్లో దాదాపుగా ఎవ్వరూ లేకుండా కొత్త వారితో కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లాకు వస్తున్న రాష్ట్ర అసోసియేట్ ప్రసిడెంట్ దస్తగిరిరెడ్డి, వైఎస్‌ఆర్ కడప జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాసులు అడ్‌హాక్ కమిటీని ప్రకటించనున్నారు.


