ఇళ్ల బిల్లుల సందేహాలకు ఫోన్ చేయండి
కర్నూలు(అర్బన్): జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు సామాగ్రి(సిమెంట్, స్టీల్), రావాల్సిన బిల్లుల విషయంలో సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించాలని జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ చిరంజీవి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కార్యాలయ ల్యాండ్ లైన్ 08518– 257481 నెంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.
విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ తెలిపారు. కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో బుధవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 15 మంది వినియోగదారులు తమ సమస్యలను ఎస్‌ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను సత్వరం పరిష్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉండటంతో పాటు జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఇంధన వారోత్సవాలను పురస్కరించుకొని ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని తొమ్మిది సర్కిల్స్ స్థాయిలో జరిగిన క్విజ్ పోటీల్లో కర్నూలు సర్కిల్‌కు ద్వితీయ స్థానం లభించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పోటీల్లో రవీంద్ర స్కూల్ విద్యార్ధులు డిస్కమ్ పరిధిలో జరిగిన క్విజ్ పోటీల్లో అద్భుతంగా రాణించారు. పోటీల్లో మొదటి స్థానంలో కడప సర్కిల్, 2వ స్థానంలో కర్నూలు సర్కిల్ నిలిచాయి. ఈ నెల 20న తిరుపతిలోని ఏపీఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ తెలిపారు.


