
వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తం
కర్నూలు(సెంట్రల్): వాయుగుండం నేపథ్యంలో జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రిజర్వాయర్లు, చెరువులు, లోతట్టు ప్రాంతాలు, పాత బ్రిడ్జీలను పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైన చోట ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నదీ తీర ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న చోట మోటార్లతో తొలగించాలన్నారు.
పత్తి విక్రయానికి పేర్లు నమోదు చేసుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో పండించిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్‌లో (గూగుల్ ప్లేస్టోర్ లేదా ఆపిల్ ఐవోఎస్‌లో అందుబాటులో ఉంది) స్లాట్ బుక్ చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పత్తి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.8,060 ఉందని, తేమ 8 నుంచి 12 శాతం వరకు ఉండాలని పేర్కొన్నారు. తేమ 12 శాతం కంటే ఎక్కువ ఉంటే అలాంటి పత్తిని సీసీఐ కొనుగోలు చేయదన్నారు. రైతులు పత్తిని లూజుగా తీసుకురావాలని, ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే సీసీఐ కొనుగోలు చేయదన్నారు.
పులికొండలో డెంగీ కేసు
పత్తికొండ రూరల్: మండల పరిధిలోని పులికొండ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక డెంగీ బారిన పడింది. ఈ నేపథ్యంలో బుధవారం మలేరియా సబ్‌యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అలాగే బాలిక కస్తూరిబా పాఠశాలలో చదువుతుండటంతో పాఠశాల పరిసరాల్లో సైతం తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
పంటల నమోదు గడువు మరోసారి పొడిగింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంటల నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ మరోసారి పొడిగించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ–క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలోని మొత్తం సర్వే నెంబర్లు, వీటికి సంబంధించిన భూములను ఇప్పటి వరకు 56 శాతం మాత్రమే నమోదు చేశారు. ఈ ఖరీప్ సీజన్‌లో సాగైన భూముల వరకు అయితే 92 శాతం నమోదయింది. దాదాపు 3 నెలలుగా పంటల నమోదు జరుగుతోంది. ఇప్పటికి మొత్తం సర్వే నెంబర్లలో 56 శాతం మాత్రమే పూర్తయింది. తాజాగా ఈ నెల 30 వరకు పంటల నమోదు కార్యక్రమాన్ని పొడిగిస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీసీలో అప్రెంటీస్‌కు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు అప్రెంటీస్‌కు దరఖాస్తు చేసుకోవాలని జోనల్ స్టాఫ్ శిక్షణ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.నజీర్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.www.apprenticerhipindia.gov.in అనే వెబ్‌సైట్‌లో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు 08518–257025 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
మా గ్రామంలో మద్యం అమ్మొద్దు!
కల్లూరు: మా గ్రామంలో మద్యం అమ్మకూడదని గ్రామ ప్రజలందరూ ర్యాలీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగోలోకి వచ్చింది. కల్లూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ప్రజలందూ గ్రామంలో మద్యం అమ్మకూడదని నిర్ణయించారు. ఇప్పుడున్న మద్యం షాపులను వెంటనే మూసివేయాలంటూ రెండు రోజుల క్రితం ర్యాలీ చేశారు. అలాగే దండోరా కూడా వేయించారు. గ్రామ ప్రజల ఐక్యత వర్ధిలాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పెద్దలు నిర్ణయించారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు ర్యాలీకి దూరంగా ఉండటం గమనార్హం.