
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
● తొలిరోజు పరమేశ్వరుడి దర్శనానికి
పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడు కొలువైన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి నవంబరు 21వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీకమాసంలో శివుని ఆరాధనకు భక్తులు అసక్తి చూపుతారు. ఇందులో భాగంగా కార్తీకమాసం మొదటిరోజు శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాస్ట్రాల నుంచి సైతం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. ఆలయం ముందు గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాఢవీఽధిలో ఉసిరి చెట్ల కింద పలువురు భక్తుల దీపారాధన చేసుకుని, ప్రత్యేక నోములు చేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
వెలిగిన ఆకాశదీపం
శ్రీశైలం టెంపుల్: కార్తీకమాసోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగాణంలోని ఆలయ ప్రధాన ధ్వజస్తంభం పైభాగంలో ఆకాశదీపం నెలకొల్పారు. కార్తీకమాసం ముగింపు వరకు ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ముందుగా అర్చకులు సంకల్పాన్ని పఠించి, మహాగణపతిపూజను చేశారు. అనంతరం దీపప్రజ్వలన, దీపారాధన జరిపించారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.