
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
కర్నూలు(అర్బన్): గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షుల పాత్ర చాలా కీలకమని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో కర్నూలు డివిజన్‌లోని సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ఆధారంగానే దేశం అభివృద్ధి అంచనా వేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల భవన నిర్మాణాలు, పారిశుద్ధ్యం, రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలన్ని క్షేత్ర స్థాయిలోని సర్పంచులు, ఎంపీపీల ఆధ్వర్యంలోనే కొనసాగుతాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులకు తోడుగా స్థానిక వనరులను పెంచుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధుల ద్వారా సామాజిక అవసరాలను మెరుగు పరచుకోవాలన్నారు. జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మొదటి పౌరుడైన సర్పంచు గ్రామీణాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించాలన్నారు. గ్రామాలను ప్రగతి పథం వైపు నడిపించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గ్రామాల్లో పేదరికానికి దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీపీఆర్‌సీ కోఆర్డినేటర్ మంజులావాణి, ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు వి.జేమ్స్ కృపావరం, జి.నాగేష్, ఆస్రఫ్ బాషా, పి.జగన్నాథం పాల్గొన్నారు.