
బాధితులకు పరిహారం త్వరితగతిన అందించాలి
కర్నూలు(సెంట్రల్): కోర్టుల ఆదేశాల మేరకు బాధితులకు త్వరగా పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బుధవారం జిల్లా న్యాయ సేవాసదన్‌లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో విక్టిమ్ కంపన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులు, అనాథ పిల్లలకు ఆధార్ కార్డుల మంజూరు, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ అకౌంట్స్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు, నంద్యాల, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హిట్ అండ్ రన్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు పరిహారాలు అందించాలని ఆదేశించారు. అండర్ ట్రయల్ రివ్యూ కమిటీలో భాగంగా జైలులో ఉన ఖైదీల విడుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆధార్ కార్డులేని 125 మంది అనాథ బాలలను గుర్తించామని, అందులో 56 మందికి కార్డులు మంజూరు కాగా, మిగిలిన వారికి త్వరగా కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.