
మహిళ అవయవదానం
● గ్రీన్ ఛానల్‌తో సాఫీగా గమ్యాలకు
అవయవాలు
కర్నూలు(హాస్పిటల్): భర్త ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే మరణించినా తన రెక్కల కష్టంతో ఆరుగురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. అలాంటి తల్లికి ఫిట్స్ కారణంగా బ్రెయిన్ డెడ్ అయ్యింది. తమ తల్లి మరో నలుగురి రూపంలో జీవించి ఉండాలని పిల్లలు భావించారు. దాంతో అవయవదానానికి ముందుకొచ్చారు. గుండెలు కదలించే ఈ ఘటన కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని కొత్తపేటకు చెందిన భాగ్యమ్మ(50) భర్త సామేలు పదిహేనేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఆమె పెంచి ప్రయోజకులను చేశారు. ఈ నెల 18వ తేది రాత్రి ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చి, మెదడులో రక్తస్రావమైంది. దాంతో ముందుగా ఆమెను శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రిలో చూపించారు. అనంతరం అక్కడి నుంచి ఈ నెల 19న కర్నూలులోని మౌర్య ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు పూర్తిగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమిస్తుండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 21వ తేదిన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే అవయవాలను దానం చేసే అవకాశం ఉండటంతో జీవన్‌దాన్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ కె.రాంబాబు బృందం ఆమె పిల్లలకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దాంతో పెద్ద మనసుతో ఆ పిల్లలు తమ తల్లి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. బుధవారం ఆమె ఒక కిడ్నీ, కాలేయాన్ని కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న రోగులకు దానం చేయగా, మరో కిడ్నీని నెల్లూరులోని అపోలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి, ఊపిరితిత్తులను హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి పంపారు. ఇందుకోసం కర్నూలు పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఆలస్యం లేకుండా అవయవాలు తక్కువ సమయంలోనే నెల్లూరు, హైదరాబాద్ చేరుకున్నాయి. కష్టకాలంలో కూడా అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన భాగ్యమ్మ పిల్లలను జీవన్‌దాన్ బృందం, కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందం, యాజమాన్యం అభినందించారు. అశ్రునయనాలతో పుష్పాంజలి ఘటించి వీడ్కోలు పలికారు.

మహిళ అవయవదానం