
కాసుల కోసం కక్కుర్తి!
కాసుల కోసం వ్యవసాయ అధికారులు కక్కుర్తి పడుతున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ బయో ఉత్పత్తుల దారుడికి కొమ్ము కాస్తూ అతడు పడేసే ఎంగిలి మెతుకులకు దాసోహమవుతూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారు. లైసెన్స్ డీలర్లతోనే నకిలీ బయో ఉత్పత్తులను రైతులకు అంటగట్టి ఆమ్యామ్యాలు పోగేసుకుంటున్నారు. అక్రమ సంపాదనలో వాటా ఉండటంతో ఈ తతంగమంతా తెలిసినా జిల్లా వ్యవసాయ యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కర్నూలు(అగ్రికల్చర్): నకిలీ బయో ఉత్పత్తులను అరికట్టాల్సిన వ్యవసాయ అధికారులే అక్రమ సంపాదన కోసం అడ్డుదారులు తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన బదిలీల్లో కొందరు వ్యవసాయ అధికారులు కూటమి పార్టీల నేతలకు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చుకొని కీలకస్థానాలు పొందారు. ఇటువంటి ఏఓలు ఇప్పటికే సంపాదన కోసం పలు మార్గాలను ఎంచుకున్నారు. కొందరు మరింత తెగబడి నకిలీ బయోల ద్వారా జేబులు నింపుకునేకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వ్యవసాయ అధికారుల తీరు చూస్తే కంచే చేను మేసినట్లు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్షయ్ ఉత్పత్తులపై
అంత ప్రేమ ఎందుకో..
బయోస్టిమిలింట్స్ ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం పామ్–జి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రం పరిధిలో ఉత్పత్తి మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం ఫామ్–జి2 ద్వారా అనుమతులు ఇస్తుంది. దేశంలో ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవాలంటే కేంద్రం ఫామ్–జి3 ద్వారా అనుమతి ఇస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఎన్ని బయో స్టిమిలెంట్స్ కంపెనీలకు చెందిన ఎన్ని ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉందో.. ఆ వివరాలను వ్యవసాయ శాఖ జిల్లాకు పంపింది. ఆ వివరాల ప్రకారం జిల్లాలో 47 బయోస్టిమిలెంట్స్ కంపెనీలకు చెందిన 622 ఉత్పుత్తులకు మాత్రమే మార్కెటింగ్ చేసుకునేందుకు అనుమతులున్నాయి. కానీ వివిధ మండలాల్లో అక్షయ్ అగ్రి సొల్యూషన్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఉత్పత్తులు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కంపెనీకి చెందిన ప్లవర్ ప్లస్ అనే బయోలను వ్యవసాయ అధికారులే మార్కెటింగ్ చేయాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ ప్రాంతంలో కొందరు ఏఓలు ఐదారు కేసుల ఈ బయోలను సరఫరా చేసి లీటరు రూ.1,000 ప్రకారం వసూలు చేసిన, ఎంతకై నా అమ్ముకోవచ్చని ఉదారత చూపినట్లు సమాచారం. ఈ కంపెనీ ఉత్పత్తులపై వ్యవసాయ అధికారులకు అంత ప్రేమ ఏమిటోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులే ఈ బయో కంపెనీని నడుపుతున్నారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.
మా ఉత్పత్తులు అమ్మించండి
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత బయో కంపెనీలు జిల్లాలో హల్‌చల్ చేస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి రెండు బయో కంపెనీలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ‘ఇపుడు మా ప్రభుత్వం ఉంది. మా ఉత్పత్తులు అమ్మడానికి సహకరించండి. మీకు తగిన ప్రతిఫలం ఉంటుంది’ అంటూ వ్యవసాయ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగతా ఉత్పత్తులకు అనుమతులు లేవు. అయినా గ్రామాలు, మండలాల వారీగా ఏజెంట్లను నియమించుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి మార్కెటింగ్ చేయాలని, వ్యవసాయ అధికారులు కూడా సహకరిస్తారని, ఎవరితోనైనా ఇబ్బందులొస్తే తాము చూసుకుంటామని సదరు ప్రజాప్రతినిధి ఏజెంట్లకు చెబుతున్నట్లు సమాచారం. ఈ కంపెనీలకు కర్నూలులో ఉత్పత్తి లేదు. గుంటూరులోనే ఉత్పత్తి చేసి కర్నూలులోని గోదాములకు తరలించి మార్కెటింగ్ చేసుకుంటున్నారు.
నకిలీ బయోల ద్వారా
ఆదాయం కోసం వ్యవసాయ
అధికారుల అడ్డదారులు
అక్షయ్ అగ్రి సొల్యూషన్ ప్రైవేట్
లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తుల
అమ్మకాలకు ప్రోత్సాహం
లైసెన్స్ పొందిన డీలర్ల ద్వారానే
నకిలీ బయోల మార్కెటింగ్
వెల్లువెత్తుతున్న ఉమ్మడి గుంటూరు
జిల్లా టీడీపీ నేత కంపెనీల ఉత్పత్తులు