
కందిపప్పు.. కరువే!
కర్నూలు(సెంట్రల్): పేదలకు బియ్యం, బ్యాళ్లు, చక్కెర కచ్చితంగా ఇస్తామన్న పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ నోరు మెదపడంలేదు. కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ బ్యాళ్లు అస్సలే ఇవ్వడంలేదు, అరకొరగా చక్కెర ఇచ్చి చేతుతులు దులుపుకుంటున్నారు. దసరా పండుగ వస్తున్న తరుణంలో బ్యాళ్లు ఇస్తారనుకుని ఆశించిన ప్రజలకు ఆశాభంగమే మిగిలింది. పండగ పూట కూడా కందిపప్పు కరువడంతో పరమాన్నం, భక్షభోజ్యాలకు పేదలు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
16 నెలల్లో మూడు నెలలు మాత్రమే!
కర్నూలు జిల్లాలో 6,34,631 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1 నుంచి 18వ తేదీల మధ్య రేషన్ షాపుల ద్వారా సరుకులను సరఫరా చేస్తున్నారు. ఒక్కో కార్డుకు కేజీ కంది పప్పు ఇవ్వాలని స్వయంగా మంత్రి ప్రమాణస్వీకారం చేసిన తరువాత మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాల తరువాత జిల్లాకు బ్యాళ్ల కేటాయింపులే జరగడంలేదు. జిల్లాకు దాదాపు 600 టన్నుల బ్యాళ్లను కేటాయించాలి. ప్రభుత్వం ప్రతి కార్డుకు కేజీ బ్యాళ్లను రూ.67లకు సరఫరా చేస్తుంది. ఈక్రమంలో ప్రభుత్వం బ్యాళ్లు లేకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.అక్కడ కిలో ఏకంగా రూ.180పైగా ధర పలుకుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే బ్యాళ్లను ఇవ్వకపోవడంతో బయటిమార్కెట్‌లో అధిక రేటుకు కొనుగోలు చేయలేక పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు పప్పుకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు అవుతోంది. ఇందులో బ్యాళ్లను సరఫరా చేసింది మాత్రం కేవలం 3 నెలలు మాత్రమే!
జొన్నలు తీసుకోవడానికి
ముందుకు రాని ప్రజలు
ప్రస్తుతం జిల్లాలోని రేషన్ కార్డుదారులకు కేవలం బియ్యం మాత్రమే రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. దాదాపు 10,500 టన్నుల బియ్యాన్ని కేటాయించారు. కాగా.. 1100 టన్నుల జొన్నలు ఉన్నా పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీసుకోవడానికి ఇష్టపడంలేదు. జొన్నలు నాణ్యత పరంగా నాసిరకంగా ఉంటున్నాయనేది ప్రజల వాదన. కాగా, ఒక్కో కార్డుకు 2 లేదా 3 కేజీలు బియ్యానికి బదులుగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా జొన్నలను వినియోగదారులకు అందించాలి.
రేషన్‌కార్డుదారులకు అక్టోబర్‌కు సంబంధించి బ్యాళ్ల కేటాయింపులు జరుగలేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. జిల్లాకు 11వేల టన్నుల బియ్యం, 1,100 టన్నుల జొన్నల కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 338 టన్నుల చెక్కర అందుబాటులో ఉంది. ప్రజలు ఆయా నిత్యావసరాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటరాముడు, డీఎం, సివిల్ సప్లై సంస్థ
అరకొరగా చక్కెర కేటాయింపులు
రేషన్‌షాపుల్లో ప్రతి కార్డుదారుడికి అర్ధకేజీ చెక్కరను రూ.17.50 లకు పౌర సరఫరాల సంస్థ సరఫరా చేస్తోంది. అయితే కార్డుకు కనీసం కేజీ చెక్కరైనా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకోవడంలేదు. కేవలం అర్ధఽ కేజీ మాత్రమే ఇస్తుంది. అన్న అంత్యోదయ కార్డు దారులకు మాత్రం కేజీ చక్కెర చొప్పున సరఫరా ఇస్తారు. ప్రస్తుతం అక్టోబర్ నెలకు సంబంధించి జిల్లాకు 338 టన్నుల చక్కెర అందుబాటులో ఉంది.
ఏడు నెలలుగా రేషన్ షాపులకు
బ్యాళ్ల కేటాయింపులే లేవు
బయటి మార్కెట్‌లో కిలో బ్యాళ్ల ధర
రూ.180 పైమాటే
కొనలేక ఇబ్బంది పడుతున్న పేద,
మధ్యతరగతి ప్రజలు
ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఇస్తున్నది
బియ్యం, అరకొరగా జొన్నలు మాత్రమే!

కందిపప్పు.. కరువే!

కందిపప్పు.. కరువే!