
శ్రీగిరిలో నేటి నుంచి దేవీశరన్నవరాత్రోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: విజయ దశమి సందర్భంగా శ్రీగిరి క్షేత్రంలో సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు భ్రమరాంబాదేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈఓ ఎం.శ్రీనివాసరావు ఇటీవల అధికారులతో సమావేశమై భక్తులకు ఏలోటూ రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈఓ సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించబడే ఈ ఉత్సవాలలో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు.
నేడు ఉత్సవాలకు అంకురార్పణ
దసరా మహోత్సవాలకు నాందిగా సోమవారం ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేస్తారు. గణపతి పంచాక్షరీ, కుంకుమార్చనలు, కుమారి పూజలు జరిపిస్తారు. ఉదయం 9.30 గంటలకు స్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం చేసి వేదస్వసి , మహానివేదనలు జరిపిస్తారు. సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, రుద్రహోమం, అమ్మవారికి నవావరణార్చన, కుంకుమార్చనలు జరిపిస్తారు.
దసరా మహోత్సవాల్లో నేడు
దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంలో అధిష్టింప జేసి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు
అంకురార్పణ
మొదటిరోజు శ్రీశైల భ్రామరీకి
శైలపుత్రి అలంకారం
భృంగివాహనంపై విహరించనున్న
స్వామిఅమ్మవార్లు