
కేంద్రియ విద్యాలయంలో సీట్ల భర్తీ
డోన్ టౌన్: డోన్‌లో కొత్తగా ఏర్పాటైన కేంద్రియ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి లాటరీ పద్ధతిలో విద్యార్థులకు సీట్లు కేటాయించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్ధికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో డోన్‌లో కేంద్రియ విద్యాలయం ఏర్పాటైంది. 765 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా గురువారం ఎంపిక ప్రక్రియ కమిటీ కన్వీనర్ ప్రిన్స్‌పాల్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ప్రకారం 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సీట్లు కేటాయించారు. లాటరీ పద్ధతిలో ప్రతి తరగతికి 40 మంది విద్యార్థుల చొప్పున 200 మందికి ప్రవేశం కల్పించారు. ఎంపికై న అభ్యర్థుల వివరాలను కమిటీ స్కూల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం నోటీసు బోర్డులో ఉంచనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పక్రియలో కమిటీ సభ్యులు టీచర్ల కేటగిరి నుంచి ఒకరు, ఎస్సీ, ఎస్టీ కేటగిరి నుంచి ఇద్దరు, కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాధికారులు ప్రభాకర్, నాయక్ హాజరు కాగా అధికారుల సమక్షంలో వీడియో కెమెరా చిత్రీకరిస్తూ లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. కాగా ఎంపిక ప్రక్రియ ప్రారంభంలో కొంత గందరగోళం నెలకొంది. ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు కన్వీనర్‌ను ప్రశ్నించగా.. తుది జాబితా ప్రకటనలో ఏవైనా అనుమానాలు ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చునని సూచించారు.