కేఎంసీలో పెరిగిన మెడిసిన్‌ పీజీ సీట్లు | - | Sakshi
Sakshi News home page

కేఎంసీలో పెరిగిన మెడిసిన్‌ పీజీ సీట్లు

Sep 12 2025 9:45 AM | Updated on Sep 12 2025 3:54 PM

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కాలేజిలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి అదనంగా తొమ్మిది పీజీ సీట్లు పెరిగాయి. ప్రస్తుతం 20 పీజీ సీట్లు ఉండగా, అదనంగా 9 సీట్లకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతిచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ తెలిపారు. పెరిగిన సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తాయని, ఈ సీట్ల కోసం ప్రత్యేకంగా జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీరాములును ఢిల్లీకి పంపి ప్రక్రియ పూర్తి చేయించామన్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ, క్యాన్సర్‌ మొదలైన విభాగాల్లో అదనపు పీజీ సీట్ల కోసం ప్రతిపాదనలు పంపించామని, వచ్చే విద్యాసంవత్సరం అవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

శని, ఆదివారాల్లో మార్కెట్‌కు సెలవు

కర్నూలు(సెంట్రల్‌): శని, ఆదివారాల్లో కర్నూలు మార్కెట్‌ యార్డుకు సెలవు ఉండడంతో ఉల్లిని తాడేపల్లిగూడెంకు తరలించి అమ్ముకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో సూచించారు. అక్కడ అమ్ముకున్నా క్వింటా ఉల్లికి రూ.1200 మద్దతు ధర ఉంటుందన్నారు. అయితే కర్నూలు జిల్లా నుంచి తాడేపల్లెగూడెంకు ఉల్లిని తీసుకెళ్తే ఇచ్చే మద్దతు ధర రవాణా ఖర్చులకే సరిపోతుందని రైతులు పేర్కొంటుండటం గమనార్హం. 

కాగా, తాడేపల్లెగూడెంకు వెళ్లే రైతులు ఆధార్‌, బ్యాంకు పాసుబుక్‌, ఈక్రాప్‌ నమోదు ఒరిజినల్‌ సర్టిఫికెట్‌, పొలం పాసు బుక్కు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. కాగా, మే నుంచి జూన్‌ 15వ తేదీ వరకు ఉండి పక్వానికి వచ్చిన ఉల్లిని మాత్రమే కోయాలని సూచించారు. జూలైలో వేసిన పంటను అక్టోబర్‌ వరకు వేచి ఉండి కోయాలని పొలంలో కనీసం వందరోజులు ఉండాలని, కోసిన తరువాత బాగా అరబెట్టుకొని గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కు తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు.

పెద్దాసుపత్రిలో డయాలసిస్‌ మిషన్లు ప్రారంభం

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజి విభాగంలో రెండు అత్యాధునిక డయాలసిస్‌ మిషన్లను గురువారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాలసిస్‌ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఈ రెండు యంత్రాల ద్వారా రోగులకు మరింత సమర్థవంతమైన వైద్యసేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్‌ వెంకటరమణ, నెఫ్రాలజి విభాగ వైద్యులు పీఎన్‌ జిక్కి, అనంత్‌, వెంకటపక్కిరెడ్డి, శ్రీధర్‌ శర్మ పాల్గొన్నారు.

జీడీపీకి భారీగా వరద నీరు

కర్నూలు సిటీ: భారీ వర్షాలతో గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇంజినీర్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేట్లు ఎత్తితే హంద్రీ నదితీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.

సుంకేసులలో..

ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో 78 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 6 క్రస్టు గేట్లను ఎత్తి 26,676 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్‌కు 2012 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

రేపు జాతీయ లోక్‌ అదాలత్‌

కర్నూలు(టౌన్‌): జాతీయ లోక్‌ అదాలత్‌ను ఈనెల 13న కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌, ప్రీ లిటిగేషన్‌ కేసులు పరిష్కరించుకోవాలన్నారు. కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో 5 బెంచీలు, ఇతర మండలాల్లో 15 బెంచీలు ఏర్పాటవుతాయన్నారు. కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను వినియోగించుకుని తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

కేఎంసీలో పెరిగిన మెడిసిన్‌ పీజీ సీట్లు  1
1/1

కేఎంసీలో పెరిగిన మెడిసిన్‌ పీజీ సీట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement