
మానవత్వం లేని ప్రభుత్వం
ఆరుగురు విద్యార్థులు చనిపోతే కనీస స్పందన కరువు
ఆస్పరి: గొప్పలు చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి కనీస మానవత్వం కరువైందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. గత ఆగస్టు 20వ తేదీన ఆస్పరి మండలంలోని చిగిళి గ్రామంలో 5వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఎమ్మెల్యే చిగిళి గ్రామానికి వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. విద్యార్థుల తల్లులు మారుతమ్మ, జిలేకాబి, మమత, నాగవేణి, లక్ష్మి, మల్లమ్మలకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున మొత్తం రూ. 3లక్షల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఘటన చోటు చేసుకొని 20 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోతే ఎలాగని ప్రశ్నించారు. దుఃఖంలోని కుటుంబాలకు కూటమి నేతలు కనీసం మేమున్నామని భరోసా కల్పించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వానికి పేదలంటే చులకన భావమన్నారు. పేదలను ఆదుకోవడానికి వారికి చేతులు రావన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటలకే పరిమితం కానీ పేదలకు సహాయం చేసే గుణం లేదన్నారు. ఘటన జరిగిన నాటి నుంచి జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషాను విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నానన్నారు. అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెబుతున్నారే కానీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేకపోయారన్నారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానన్నారు. ప్రభుత్వం స్పందించకున్నా విద్యార్థి కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యేను చిగిళి గ్రామస్తులు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ రాధాక్రిష్ణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను
పరామర్శించని కూటమి నేతలు
న్యాయం జరిగే వరకు
పోరాటం కొనసాగిస్తా
చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చిన
ఎమ్మెల్యే విరూపాక్షి
తన వంతుగా ఒక్కో కుటుంబానికి
రూ.50వేల ఆర్థిక సాయం

మానవత్వం లేని ప్రభుత్వం