
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉక్కపోత తీవ్రం అవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదవుతాయి. అయితే బుధవారం కర్నూలులో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 26 డిగ్రీలకు చేరుకుంది. ఉష్ణోగ్రతలు వేసవిని తలపించడం గమనార్హం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
వినియోగదారులకు మెరుగైన సేవలు
● డయల్ యువర్ ఎస్‌ఈ
కార్యాక్రమంలో ఎస్‌ఈ ఉమాపతి
కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలని విద్యుత్ శాఖ ఎన్‌ఈ ఉమాపతి తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయం నుంచి డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు అర్బన్ నుంచే కాకుండా జిల్లాలోని వివిధ మండలాల నుంచి 14 మంది వినియోగదారులు తమ సమస్యలను ఎస్‌ఈ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో పనిచేయాలని కోరారు. వర్షాలు పడుతున్నందున ఏవైన సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే స్పందించాలని సూచించారు. కార్యక్రమం కమర్షియల్ డీఈఈ బాస్కర్ పాల్గొన్నారు.
ఎంపీహెచ్‌ఏ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలులోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఎంపీహెచ్‌డబ్ల్యు(ఫిమేల్)/ఏఎన్‌ఎం ఉచిత శిక్షణకు అర్హులైన మహి ళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వై.జయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వయస్సు 17 సంవత్సరాలు దాటి ఉండాలని, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత(ఏ గ్రూపు అయినా ఫరవాలేదు), వొకేషనల్, వన్ సిట్టింగ్ ఉత్తీర్ణత పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులు ప్రభుత్వ వెబ్‌సైట్ https://cfw.ap.nic నుంచి లేదా ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్) కార్యాలయం నుంచి పొంది వాటిని పూర్తి చేసి ఈ నెల 30లోపు అక్కడే సమర్పించాలన్నారు. శిక్షణా కాలంలో శిక్షణా కేంద్రంలోనే ఉచిత హాస్టల్ వసతి, నెలసరి స్టయిఫండ్ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 85559 10104, 90593 27020, 99590 30873 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
పనుల వేగవంతానికి చర్యలు చేపట్టండి
కర్నూలు(అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో నాబార్డు, పీఎంజీఎస్‌వై, ఏపీఆర్‌ఆర్‌పీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పీఆర్ ఎస్‌ఈ ఐ.వేణుగోపాల్ కోరారు. బుధవారం స్థానిక జెడ్పీ ప్రాంగణం విశ్వేశ్వరయ్య భవన్‌లోని తన చాంబర్‌లో కర్నూలు డివిజన్‌కు చెందిన డీఈఈ, ఏఈలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ నాబార్డు నిధులు రూ.5.40 కోట్లతో చేపట్టిన ఐదు పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఏపీఆర్‌ఆర్‌పీ కింద మొత్తం 27 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 16 పనులను పూర్తి చేశారని, మిగిలిన 11 పనులను కూడా నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. కర్నూలు ఎంపీ నిధులు రూ.7.34 కోట్లతో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతరత్రా పనులు చేపడుతున్నామన్నారు. పనులను పూర్తి నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కర్నూలు ఈఈ మహేశ్వరరెడ్డి, పీఏ టు ఎస్‌ఈ బండారు శ్రీనివాసులు, డీఈఈలు రమేష్‌కుమార్‌రెడ్డి, నాగిరెడ్డి, కర్రెన్న, శేషయ్య, నాగిరెడ్డి, ఏఈఈలు పాల్గొన్నారు.

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి