
కష్టం మట్టిపాలు!
● ధరలేక ఉల్లి పంటను దున్నేసిన రైతు
పత్తికొండ రూరల్: చెమటోడ్చి పండించిన రైతు కష్టం మట్టిపాలైంది. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఉల్లికి మద్దతు ధర ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది. మార్కెట్‌లో ధర లేక రైతులు పంటపై పెట్టుకున్న గంపెడు ఆశలు ఆవిరయ్యాయి. బుధవారం ఓ రైతు ఆవేదనతో రెండెకరాల్లో ఉల్లి పంటను తొలగించి, గొర్రెలకు వదిలేశాడు. మండల పరిధిలో ని పెద్దహుల్తి గ్రామ సర్పంచు విజయలక్ష్మి భర్త నాగరాజు రెండెకరాల్లో ఉల్లి పంట సాగుచేశాడు. సుమారు రూ.లక్షకు పైగానే ఖర్చుపెట్టాడు. ఇప్పుడు కోతకు, మార్కెట్‌కు తరలించేందుకు రవాణా చార్జీలు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కనీస ధర కూడా పలకని పరిస్థితి. క్వింటా ధర రూ.200 మించకపోవడం.. ప్రభుత్వం మద్దతు ధర రూ.1200 ప్రకటించినా కొనుగోలు చేసే నాథుడే లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్నాడు. ఈ ధరలతో అమ్ముకుంటే కనీసం కూలీల ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని రెండెకరాల్లోని ఉల్లి పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. విధిలేని పరిస్థితుల్లో గొర్రెల మందకు వదిలేయడం ఉల్లి రైతుల దీనావస్థకు అద్దం పట్టింది.
నాణ్యతగా ఉన్న ఉల్లి గడ్డలు

కష్టం మట్టిపాలు!

కష్టం మట్టిపాలు!