
హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు ఇంటర్వ్యూలు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన యువతకు హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించేందుకు బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ శిక్షణ పొందేందుకు మొత్తం 21 మంది ( సీ్త్రలు, పురుషులు ) దరఖాస్తు చేసుకోగా, స్థానిక ఎస్సీ కార్పొరేషన్‌లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు 18 మంది హాజరయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి ఆధ్వర్యంలో డీటీసీ, ఆర్‌టీసీ ఒకటవ డిపో మేనేజర్, డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఇంటర్వ్యూకు హాజరైన వారిలో 10 మందిని ఎంపిక చేశామని, ఇందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు ఈడీ తెలిపారు. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాలలోని రవాణా శాఖ అధికారి చాంబర్‌లో ఇంటర్వ్యూలను నిర్వహించమన్నారు. మొత్తం 14 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, 10 మందిని ఎంపిక చేయగా ఒకరు మహిళ ఉన్నట్లు వెల్లడించారు. రెండు జిల్లాల్లో జరిగిన ఇంటర్వ్యూల్లో ఎస్సీ కార్పొరేషన్ ఈఓ విజయలక్ష్మితో పాటు కమిటీ అధికారులు పాల్గొన్నారు.