
సొంత ఆదాయ వనరులతో గ్రామాల అభివృద్ధి
కర్నూలు(అర్బన్): గ్రామాల్లో సొంత ఆదాయ వనరులను నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకుంటే గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవచ్చని జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని డీపీఆర్‌సీ భవనంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు ‘ సొంత ఆదాయ వనరులు ’ అనే అంశంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వేర్వేరుగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీపీఓ భాస్కర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులైన పన్నులు, పన్నేతరములు, ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆదాయ వనరుల సమీకరణకు సంబంధించి ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. పంచాయతీల్లో ఖాళీ స్థలాలు ఉంటే వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసిన వారమవుతామన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, టీఓటీలు వి.జేమ్స్ కృపావరం, వి.ప్రభాకర్, అస్రఫ్‌బాషా, పి.జగన్నాథం, డీకే దస్తగిరిబాషా తదితరులు పాల్గొన్నారు.