కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అక్టోబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఎన్నికలను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్రమణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి ఆదేశించారు. బుధవారం సీక్యాంపులోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కార్యాలయంలో సెప్టెంబర్ మాసానికి సంబంధించిన సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆదోనినియోజకవర్గానికి సంబంధించిన పెన్షనర్ల ఎన్నికలు అక్టోబర్ ఆఖరులోపు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంక్షేమం, పెన్షనర్ల సంఘం భవన నిర్మాణంపై చర్చించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివారెడ్డి, రాజారావు,కోట్ల లింగన్న, క్రిష్టఫర్, మోహన్‌రావు, పాపారావు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కర్నూలు: గణేష్ నగర్‌లో నివాసముంటున్న వెంకట ప్రసాద్ (31) ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయనది రుద్రవరం స్వగ్రామం. తండ్రి శ్రీనివాసులు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసేవారు. పదవీ విరమణ అనంతరం కర్నూలులోనే స్థిరపడ్డారు. ఈయనకు నలుగురు కుమారులు కాగా మూడో కుమారుడైన వెంకటప్రసాద్ బజాజ్ ఫైనాన్స్‌లో పనిచేసేవాడు. మద్యానికి బానిసై ఉద్యోగం మానుకుని స్నేహితులతో కలసి అల్లరిచిల్లరగా తిరిగేవాడు. రెండు నెలల క్రితం పచ్చ కామెర్లు సోకడంతో గణేష్ నగర్‌లోని ఒక గదిలో ఉంటున్నాడు. ఆదివారం నుంచి బయటకు రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పచ్చ కామెర్ల వ్యాధితో బాధ పడుతుండగా మద్యం మానుకోమని చెప్పినప్పటికీ వినలేదని, వ్యాధి తీవ్రమై చనిపోయాడని తమ్ముడు వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ పోలీసులు తెలిపారు.
డోన్‌లో అంతే!
● అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న కొన్ని వ్యాపార సంఘాలు
డోన్: మొన్న చికెన్ అతి తక్కువ ధరకు అమ్ముతున్నారని గెలాక్సీ చికెన్ సెంటర్‌పై దాడిచేసిన చికెన్ వ్యాపారుల సంగతి మరువక ముందే ఇటీవల కొత్తగా ప్రారంభించిన కేరళ మెన్స్‌వేర్ దుకాణం ఎత్తేసే వరకు డోన్ స్థానిక వ్యాపారులు నిద్రపోలేదు. ఇలాంటి జాడ్యం పట్టణంలో రోజురోజుకూ అధికమవుతుందనేందుకు మరో ఘటన చోటు చేసుకుంది. పట్టణంలో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నూర్‌బాషా అనే వ్యాపారి దానిమ్మ పండ్లను కేజీ రూ.120 అమ్మకుండా రూ.60కే అమ్ముతున్నాడనే కారణంతో పండ్ల వ్యాపారుల సంఘం నాయకులు రవి అతనిపై దాడిచేసి తక్కెడ, రాళ్లను ఎత్తుకెళ్లాడు. ఈ విషయంపై బాధితుడు నూర్ బాషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పండ్ల వ్యాపారులు పోలీసులను ఏమాత్రం లెక్కచేయకుండా ‘మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి’ అంటూ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం. బయటి వ్యాపారులు పట్టణంలో వివిధ రకాల వస్తువులను, తినుబండారాలను తీసుకువస్తే ఇన్నాళ్లు జరిగిన తమ దోపిడీ విధానానికి ఎక్కడ తెరపడుతుందోనని సంఘాల ముసుగులో కొందరు వ్యాపారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.