
27 నుంచి బన్ని ఉత్సవాలు
● ముహూర్తం ఖరారు చేసిన
పురోహితులు
● అక్టోబర్ 2న మాళ మల్లేశ్వరాస్వామి
కల్యాణోత్సవం
హొళగుంద: దసరా పండుగ వచ్చిందంటే ఠక్కున గుర్తుకు వచ్చేది దేవరగట్టు శ్రీమాళమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవం. రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఈ ఉత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు బుధవారం నెరణికి గ్రామంలో పురోహితులు ముహూర్తం ఖరారు చేశారు. ఉత్సవాల ఆహ్వాన ప్రతిని ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, హొళగుంద ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌తో కలిసి ఉత్సవ నిర్వాహకులైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు, ఆలయ పూజారులు విడుదల చేశారు. త్వరలోనే కరపత్రాలను ముద్రించి అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు.
బన్ని ఉత్సవాల నిర్వహణ ఇలా ..
● ఈనెల 27వ తేదీ శనివారం దేవరగట్టులో మాత మాళమ్మ మల్లేశ్వరునికి కంకణధారణం, నిశ్చితార్థం.
● అక్టోబర్ 2వ తేది గురువారం విజయదశమి రోజున కల్యాణోత్సవం, బన్ని ఉత్సవం, జైత్రయాత్ర.
● 3వ తేది శుక్రవారం భవిష్యవాణి (దైవవాణి)
● 4న శనివారం సాయంత్రం స్వామి వారి రథోత్సవం
● 5న ఆదివారం గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం.
● 6న సోమవారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.