
ఉన్నది ఒకటే జిందగీ!
ఇటీవల పెరిగిన బలవన్మరణాలు
ఆత్మీయ స్పర్శతో నివారణకు అవకాశం
నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదో ఒక చోట వ్యక్తులు ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు చేస్తూనే ఉన్నారు. బలవంతంగా తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రతి నెలా 30 నుంచి 40 మంది దాకా బలవంతంగా తనువు చాలిస్తున్నారు. ఇందులో పలువురు వివిధ కారణాలతో క్షణికావేశంతో ఆయువు తీసుకుంటున్నారు. మిగిలిన వారు ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, మానసిక సమస్యలు, ఆర్థిక కారణాలు, కుటుంబ సమస్యలు ఉంటున్నాయి. ఇలాంటి వారికి సమయానికి చెప్పే వారు లేకపోవడమే కారణం. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, చిన్నకుటుంబాలు ఏర్పడటం, వారికి ఏ చిన్న సమస్య వచ్చినా సర్ది చెప్పేవారు లేకపోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, పిల్లలకు మంచి విషయాలు చెప్పేవారు లేకపోవడం, సోషల్ మీడియా, సినిమాలు, టీవీ సీరియళ్లు మొదలైన అంశాలు ఆత్మహత్యలు పెరిగేందుకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆత్మహత్యతో మరణించే వారిలో ఎక్కువ మంది మానసిక ఆరోగ్య సమస్యలైన డిప్రెషన్, మత్తు–మద్యం వినియోగ రుగ్మత ఉన్న వారు, సైకోసిస్, పర్సనాలిటి డిసార్డర్స్ ఉన్నవారు ఉన్నారు. వీరితో పాటు ఆర్థిక సంక్షోభం, సంబంధాల వైఫల్యాలు, అవమానం, సన్నిహిత కుటుంబ సభ్యుడి మరణం, తీవ్రమైన అనారోగ్యం ఇవన్నీ ఆత్మహత్య దోరణిని పెంచుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో 90 శాతం క్షణికావేశంతో చేసుకునేవే ఉంటున్నాయి. కారణాలేవైనా ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారి పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉంటే చాలు నిరోధించవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారి మానసిక సమస్యలు తెలుసుకుని, వారిలో ఆత్మహత్యకు సిద్ధమైన వారు ఉంటే అలాంటి వారిని ముందే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించి అవసరమైన మందులు అందిస్తున్నాము.
–డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, మానసిక వైద్యవిభాగాధిపతి, జీజీహెచ్, కర్నూలు
చాలావరకు ఆత్మహత్యలు మానసిక ఒత్తిళ్లు, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పరీక్షల్లో ఫెయిల్ కావడం, సంక్షోభాలు, జబ్బు నయం కాదనే భయంతోనే జరుగుతుంటాయి. కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టినా తట్టుకోలేరు. ఆత్మహత్య ఆలోచన వచ్చిన వారు టెలిమానస్ 144169 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే వారు అలాంటి వారికి కౌన్సిలింగ్ చేసి ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనల నుంచి దూరం చేస్తారు.
–డాక్టర్ ఎం. శివశంకర్‌రెడ్డి, మానసిక వైద్యులు, కర్నూలు
ఆత్మహత్యలు వద్దు..బతికి సాధిద్దాం

ఉన్నది ఒకటే జిందగీ!

ఉన్నది ఒకటే జిందగీ!