పనిమనిషే హంతకురాలు | - | Sakshi
Sakshi News home page

పనిమనిషే హంతకురాలు

Sep 10 2025 3:39 AM | Updated on Sep 10 2025 3:39 AM

పనిమనిషే హంతకురాలు

పనిమనిషే హంతకురాలు

● శివలీల హత్య కేసును ఛేదించిన పోలీసులు ● సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ

● శివలీల హత్య కేసును ఛేదించిన పోలీసులు ● సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ

కర్నూలు : వృద్ధురాలు కాటసాని శివలీలను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న సొత్తులను తస్కరించిన నిందితురాలిని సీసీ కెమెరాలు పట్టించాయి. గణేష్‌ నగర్‌ పక్కనున్న (కల్లూరు అర్బన్‌ 19వ వార్డు) సాయి వైభవ నగర్‌లో నివాసముంటున్న శివలీల (75) ఈనెల 1వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. మూడో పట్టణ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వారం రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శివలీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను తస్కరించి పరారయ్యారు. ఈ మేరకు అల్లుడు చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా శివలీల ఇంట్లో పనిమనిషిగా ఉన్న కురువ వరలక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించారు. కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామంలో ఆమె అక్క ఇంట్లో తలదాచుకుని ఉన్నట్లు ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా నిర్ధారించుకుని అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకుని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఎదుట హాజరుపరిచారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌, సీఐలు శేషయ్య, చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ ఎస్‌ఐ ధనుంజయతో కలసి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు.

హత్య చేసి తాపీగా గోడ దూకి...

ప్యాపిలి మండలం గోపాల నగరం (గోపాల పురం) గ్రామానికి చెందిన వరలక్ష్మి ఉపాధి నిమిత్తం వలస వచ్చి కర్నూలులో నివాసముంటున్నారు. రెండు నెలల క్రితం కాటసాని శివలీల ఇంట్లో పనిమనిషిగా చేరింది. హత్యకు రెండు రోజుల ముందు పని మానేసింది. ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లి స్థిరపడాలని పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈనెల 1వ తేదీన స్వగ్రామం గోపాలపురంలో వరలక్ష్మి వితంతు పెన్షన్‌ తీసుకుని అక్కడి నుంచి డోన్‌ మీదుగా కర్నూలు వచ్చి గుత్తి పెట్రోల్‌ బంకు దగ్గర బస్సు దిగి అక్కడినుంచి ఆటోలో రైతుబజార్‌ మీదుగా శివలీల ఇంటి వద్దకు చేరుకుంది. ముఖానికి స్కార్ప్‌(బట్ట) కట్టుకుని శివలీల ఇంట్లోకి ప్రవేశించి మళ్లీ పనికి వస్తానమ్మా.. అంటూ మాటల్లో పెట్టి సమీపంలో ఉన్న రోకలి బండతో తలపై కొట్టింది. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోగా మెడలో ఉన్న 6 తులాల బంగారు గొలుసు, 5 తులాల గాజులు, బెడ్‌ రూమ్‌లో ఉన్న రెండు బ్యాగులను తీసుకుని బయటకు వచ్చి ఇంటి వెనుక బాత్‌రూమ్‌ పక్కనుంచి కాంపౌండ్‌ వాల్‌ దూకి పారిపోయింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టగా నిందితురాలు పనిమనిషి అయిన కురువ వరలక్ష్మినే అని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బంగారు నగల కోసమే హత్య చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి బంగారు నగలు, 6 చెక్‌బుక్‌లు, 7 బ్యాంకు పాస్‌ బుక్కులు, నేరానికి ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement