
పేదల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి
కర్నూలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత ఉన్న పేదవారికి చేరవేసి ప్రయోజనం కల్పించే దిశగా ఎన్‌జీఓలు (స్వచ్ఛంద సంఘాలు) పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు న్యాయ సేవా సదన్‌లో ఉమ్మడి జిల్లా ఎన్‌జీఓలకు సెన్సిటైజేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎడ్యుకేషన్, చైల్డ్ వెల్ఫేర్, డిజబిలిటీ, పోలీసు శాఖలకు సంబంధించిన అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు, అక్రమ రవాణా బాధితులు, ట్రాన్‌జెండర్స్, గిరిజనులు, అసంఘటిత కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేసే ఎన్‌జీఓలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సెన్సిటైజేషన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసినట్లు లీలా వెంకటశేషాద్రి తెలిపారు. పేదలు, ప్రభుత్వ శాఖల మధ్య అనుసంధానకర్తలుగా ఎన్‌జీవోలు ఉండాలని కోరారు. సీనియర్ సిటిజన్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్ రయీస్ ఫాతిమా మాట్లాడుతూ తమ శాఖ ద్వారా సీనియర్ సిటిజన్లకు, ట్రాన్స్‌జెండర్లకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ మాట్లాడుతూ పేద పిల్లలను గుర్తించి, స్కూళ్లలో చేర్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాల మండల విద్యాశాఖ అధికారులు కర్నూలు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారదా, స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు సుధారాణి, డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, బచ్చన్ బచావో ఆందోళన్ మౌనిక, నారాయణ, రామాంజినేయులు, విజయ, సుబ్బరాయుడు తదితరులు సదస్సులో పాల్గొన్నారు.