
పండ్లతోటల అభివృద్ధిపై దృష్టి సారించండి
● సాంకేతిక సహాయకులకు డ్వామా పీడీ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పండ్లతోటల తోటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య జాతీయ ఉపాధి హామీ పథకానికి చెందిన సాంకేతిక సహాయకులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డ్వామా సమావేశ మందిరంలో పత్తికొండ, ఆదోని, ఆలూరు క్లస్టర్ల పరిధిలోని సాంకేతిక సహాయ సహాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీడీ మండలాల వారీగా పండ్లతోటల టార్గెట్ ఎంత.. ఇప్పటి వరకు సాధించిన ప్రగతి తదితర వాటిపై సమీక్షించారు. వివిధ మండలాల్లో పురోగతి తక్కువగా ఉండటంతో సంబంధిత టీఏలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ఏడాది 4500 ఎకరాల్లో ఉపాధి నిధులతో వందశాతం సబ్సిడీతో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 4220 ఎకరాలకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఈ నెల చివరిలోపు లక్ష్యం మేరకు ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఫాంపాండ్స్ తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో ఏపీడీలు లక్ష్మన్న, క్రిష్ణమోహన్, ప్లాంటేషన్ మేనేజర్ నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు.