
సైబర్ నేరగాళ్లు నగదు కాజేశారు!
కర్నూలు: పీఎం కిసాన్ పేరుతో తన మొబైల్‌కు ఏపీకే ఫైల్ పంపి రెండు బ్యాంకు ఖాతాల నుంచి రూ.65 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారని, విచారణ జరిపి పోయిన డబ్బును రికవరీ చేసి ఇవ్వాలని కల్లూరుకు చెందిన సూర్యనారాయణ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి వారితో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 98 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● ఆర్మీలో పనిచేస్తున్న కుమారుడి దగ్గరికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఐదు నెలలుగా ఖాళీగా ఉన్న తన ఇంట్లో చేరి ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మీనగర్‌కు చెందిన జయరామిరెడ్డి ఫిర్యాదు చేశారు.
● తన పొలానికి రస్తా ఇవ్వకుండా కురువ నరసింహులు అనే వ్యక్తి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని గోనెగండ్ల మండలం హెచ్.కై రవాడి గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
● కోడుమూరు రోడ్డులో ఉన్న 18 సెంట్ల స్థలాన్ని మురళీమోహన్, కాంట్రాక్టర్ జాన్ కలసి కబ్జా చేశారని, విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కర్నూలు షరాఫ్ బజార్‌కు చెందిన వెంకటనారాయణ ఫిర్యాదు చేశారు.
● అనంతపురం పట్టణానికి చెందిన జయచంద్ర బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తనకు కూ డా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
పీజీఆర్‌ఎస్‌కు 98 ఫిర్యాదులు