
అనధికార నివాసాలపై మూకుమ్మడి దాడి
కర్నూలు(అర్బన్): నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లోని క్వార్టర్లలో అనధికారికంగా నివాసాలు ఉన్న వారిని ఖాళీ చేయించేందుకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్‌పీడీసీఎల్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూడు క్యాంపుల్లో మొత్తం 953 క్వార్టర్లు ఉండగా, వీటిలో అధికారికంగా 367 మంది నివాసం ఉంటున్నారు. అలాగే 96 క్వార్టర్లు శిథిలావస్థకు చేరగా, మిగిలిన 490 క్వార్టర్లలో అనధికారికంగా నివాసాలు ఉంటున్నారు. అనధికారికంగా నివాసాలు ఉంటున్న వారందరూ ఖాళీ చేయాలని ఇప్పటికే పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చామని, చివరి అవకాశంగా ఈ నెల 7వ తేది వరకు గడువు ఇచ్చినట్లు సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. అయితే అనధికారికంగా నివాసాల్లో ఉన్న వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా నివాసాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు. మూడు క్యాంపులకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 127 గృహాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపి వేయించినట్లు ఆర్‌అండ్‌బీ కర్నూలు ఈఈ సీవీ సునీల్‌రెడ్డి తెలిపారు. ఈ దాడులను ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్‌తో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు పర్యవేక్షించారు.
ఏబీసీ క్యాంపుల్లో 127 గృహాలకు విద్యుత్, నీటి సరఫరా కట్

అనధికార నివాసాలపై మూకుమ్మడి దాడి