
టీడీపీ నేత చెబితే వినాల్సిందే
కత్తితో బెదిరించి మేకను తీసుకెళ్లిన వ్యక్తి
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
టీడీపీ నేత ఒత్తిళ్లతో కేసు నమోదుకు పోలీసుల తాత్సారం
బేతంచెర్ల: పట్టణంలోని సంజీవనగర్ కాలనీలో టీడీపీ సానుభూతి పరుడు ఎరుకలి సుంకన్న అలియాస్ (సింహాద్రి) ఆదివారం రాత్రి వీరంగం సృష్టించాడు. కాలనీకి చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు మేకలు మేపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఎరుకలి సుంకన్న ఏడాది క్రితం రూ. 4 వేలు డబ్బులు ఇచ్చి నల్ల బోతుల వెంకటేశ్వర్లు వద్ద రెండు మేక పిల్లలను కొనుగోలు చేసి తననే పెంచాలని అక్కడే వదిలేశాడు.
కొన్నాళ్లకు అనారోగ్యంతో ఆ రెండు మేక పిల్లలు చనిపోయాయి. ఈ విషయంలో సుంకన్న తరచూ గొడవ పెట్టుకోవడంతో మేకలకు పిల్లలు పుడితే ఇస్తానని వెంకటేశ్వర్లు చెబుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో సుంకన్న మరో ఇద్దరిని వెంట బెట్టుకొని మేకల దొడ్డి దగ్గర నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు, అతని భార్య మద్దమ్మతో కత్తితో బెదిరించి ఓ మేక పోతును వెంట పట్టుకెళ్లాడు. న్యాయం కోసం బాధితులు సోమవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు.
అయితే ఎరుకలి సుంకన్నకు టీడీపీ మండల నాయకుడి మద్దతు ఉండటంతో అతనిపై కేసు నమోదు చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు సైతం అడ్డుకోలేక పోతుండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.