
అత్యవసర వైద్యానికి ‘డ్రోన్’ హారన్!
కర్నూలు (సిటీ): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్(ట్రిపుల్ ఐటీ డీఎం) సాంకేతిక విద్య, పరిశోధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో ప్రముఖ ట్రిబుల్ ఐటీగా గుర్తింపు పొందింది. సరికొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. డ్రోన్ టెక్నాలజీతో దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు ట్రిపుల్‌ఐటీడీఎంలో నూతన ఆవిష్కరణచేశారు. ఇన్క్యుబేట్ అయిన ట్రిగుణ్ రోటోటిక్స్ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్ స్టార్టప్ కింద డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ అనే సరికొత్త వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ రూపకల్పనలో ట్రిపుల్‌ఐటీ ఈసీఈ ఆచార్యులు డాక్టర్ కృష్ణ నాయక్, డాక్టర్ ఎం. రవికుమార్(మెకానికల్ ఇంజినీరింగ్), రాయలసీమ యూనివర్సిటీకి చెందిన ఖాసిఫా అంజుమ్ కీలక పాత్ర పోషించారు. అనువుకాని స్థలంలో అత్యవసరమైన సమయంలో ఈ విధానంతో సులువుగా వైద్యసేవలు అందించవచ్చు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులను చికిత్స కోసం తరలించే సమయంలో రోడ్లలో డ్రోన్ ద్వారా హారన్ కొడుతూ ట్రాఫిక్ క్లియర్ చేయవచ్చు. డ్రోన్లను ఉపయోగించి రోగుల ఆరోగ్యాన్ని డాక్టర్ పర్యవేక్షించేందుకు చక్కగా ఉపయోపడుతుంది ఈ వ్యవస్థ. ఇది మందులు, వైద్య పరికరాలను సుదూర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి, కొండల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు మందులు, అత్యవసరమైన సమయంలో రక్తం వంటివి పంపించడానికి ఉపయోగించబడుతుంది. ఈ వ్యవస్థలను భారతదేశంలోనే మొట్టమొదటిసారి కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎం ఆచార్యులు రూపొందించారు. ఈ వ్యవస్థ సుదూర గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలను అందించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. దీని పని తీరుపై ప్రస్తుతం డెమో ఇచ్చారు.
ఉపయోగాలు ఇవీ..
డ్రోన్‌ను పూర్తిగా ఆటో మేటిక్, మాన్యువల్ క్యాంట్రోల్ మోడ్‌లో నడపవచ్చు.
డాక్టర్ ఆసుపత్రి నుంచే అంబులెన్స్‌లోని రోగి స్థితిని పర్యవేక్షణ చేసి, సూచనలతో అంబులెన్స్ ఆపరేటర్ రోగికి ఫస్ట్ ఎయిడ్ అందించగలరు.
రోగిని సరైన ఆసుపత్రికి తక్షణ తరలింపుకు ఈ వ్యవస్థ సాయం చేస్తుంది.
సుదూర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు మందులు, రక్తం వంటి ముఖ్యమైన వైద్య సామాగ్రిని డ్రోన్ల ద్వారా వేగంగా చేర్చవచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో, ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, సహాయాన్ని అందించడానికి డ్రోన్లను ఉపయోగించవచ్చు.
వైద్య లాజిస్టిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి డ్రోన్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ అవసరం.
డ్రోన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన సేవలు అందించేందుకు, అంతరాయం కలుగుతుందని ప్రజలకు తెలియజేసేందుకు డప్పు కొట్టేందుకు సైతం చక్కగా ఉపయోగపడుతుంది.
కర్నూలు ట్రిపుల్‌ఐటీడీఎం
రూపొందించిన సరికొత్త వ్యవస్థ
డ్రోన్ ఆధారిత హెల్త్ కేర్ మానిటరింగ్,
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం తయారు
దేశంలోనే మొదటిసారి వినూత్న
వ్యవస్థను ఆవిష్కరించిన
ట్రిపుల్‌ఐటీ ప్రొఫెసర్లు
అత్యవసరమైన సమయంలో
ఉపయోగంగా సరికొత్త వ్యవస్థ