
అదృశ్యమైన మహిళ శవమై తేలి..
● అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు
పాములపాడు/కర్నూలు(రూరల్): ఐదు రోజుల క్రితం అదృశ్యమైన కర్నూలు మండలం పూడూరు గ్రామానికి చెందిన మైథిలీ (24) శుక్రవారం బానకచెర్ల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ పవర్‌హౌస్ వద్ద శవమై కనిపించింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. రెండేళ్ల క్రితం మైథిలీకి వివాహం కాగా.. ఏడాది క్రితం భర్తతో విడిపోయి పుట్టింటికి చేరింది. కర్నూలు నగరంలో ఓ కర్రీ పాయింట్‌లో రొట్టెలు చేస్తూ జీవనం సాగిస్తోంది. అక్కడే ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. కాగా గత నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పూడూరు గ్రామంలో కేసీ కెనాల్ వద్ద దుస్తులు ఉతికేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె సోదరి భారతి కేసీ కెనాల్ వద్దకు వెళ్లి చూడా మైథిలీ కనిపించ లేదు. అక్కడ మెట్ల వద్ద కేవలం ఒక డబ్బా మాత్రమే కనిపించింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మద్యం సేవించి అటుగా వెళ్లినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా మైథిలీ మొబైల్ అదృశ్యమైన రెండు రోజులకు ఒక వ్యక్తికి ఆమె ఫోన్ దొరకగా మరో వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులకు పంపించారు. మొబైల్లో సిమ్ కార్డు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 1వ తేదీన మైథిలీ తండ్రి బోరెల్లి ఫిర్యాదు మేరకు కర్నూలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం బానకచెర్ల గ్రామ సమీపంలోని కేసీ కెనాల్ పవర్‌హౌస్ వద్ద శవమై కనిపించింది. మృతదేహం బాగా ఉబ్బిపోయి గుర్తు పట్టని విధంగా మారడంతో ఆమె ధరించిన దస్తులను బట్టి కుటుంబీకులు మైథిలీగా గుర్తించారు. సమాచారం అందుకున్న కర్నూలు తాలుకా పోలీసు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.