
గోబీ సరుకులు తీసుకొస్తూ...
– రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చిప్పగిరి: గోబీ సరుకుల తీసుకొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యవకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అలూరులో గోబీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించే అసిఫ్ అక్బర్ వలి (31) సరుకుల కోసం గుంతకల్లు వెళ్లాడు. సరుకులు తీసుకుని గురువారం రాత్రి మోటారు సైకిల్‌పై తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో చిప్పగిరి గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే యువకుడు కుందగుర్తి నుంచి సొంత ఊరికి మోటారు సైకిల్‌పై వస్తున్నాడు. చిప్పగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో రెండు మోటారు సైకిళ్లు ఢీ కొనడంతో అక్బర్ వలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇబ్రహీంకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో ఇబ్రహీంను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. అక్బర్‌వలి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఏపీ శ్రీనివాసులు తెలిపారు.
మార్కెట్ యార్డులో
రూ.12కే కిలో ఉల్లి
కర్నూలు(సెంట్రల్): కర్నూలు మార్కెట్ యార్డులో రూ.12కే కిలో ఉల్లి లభ్యమవుతోందని, వ్యాపారులు, హోటళ్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని జేసీ డాక్టర్ బి.నవ్య సూచించారు. ఆమె శుక్రవారం మినీ కాన్ఫరెన్స్ హాలులో హోటళ్ల యజమానులు, చిరు వ్యాపారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్నూలు మార్కెట్ యార్డులో, నగరంలోని రేషన్ షాపుల్లోనూ ఉల్లిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎస్‌ఓ, ఆహార నియంత్రణాధికారులను ఆదేశించారు.