
శాంతి.. ఐక్యత... భక్తి
కర్నూలు(అర్బన్): ముస్లింల పవిత్ర పర్వదినం, ప్రవక్త హజ్రత్ మహమ్మద్ జన్మదినం సందర్భంగా మిలాద్ – ఉన్ – నబీ పండుగను శుక్రవారం ముస్లింలు పవిత్రంగా జరుపుకున్నారు. దర్గాల్లో ప్రత్యేక ప్రార్థన చేశారు. అన్ని ప్రాంతాల్లో శాంతి, ఐక్యత, భక్తి వెల్లివిరిసింది. సెంట్రల్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మసీదులైన రోజా దర్గా, హజ్రత్ లతీఫ్ లౌబాలీ దర్గా, లాల్ మస్జీద్, కలీ కరీం మస్జీద్, మచ్చివాలే సాహెబ్ నివాసం తదితర ఆధ్యాత్మిక కేంద్రాల్లో జియారత్ – ఏ – ఆసార్ – ఏ – ముబారక్ నిర్వహించారు. సయ్యద్ షా షఫీ పాషా ఖాద్రీ నేతృత్వంలో హజ్రత్ లతీఫ్ లౌబాలీ దర్గా నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ముస్లిం మత పెద్దలు సజ్జాదగాహ్, ముషాయిఖీన్‌తో పాటు పెద్ద సంఖ్యలో ముస్లింలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చిన్నారులు ఇస్లామిక్ జెండాలు ఊపుతు, తమ చిన్న సైకిళ్లపై రావడంతో ర్యాలీ మరింత అందంగా మారింది. ఈ నేపథ్యంలోనే ర్యాలీలో పాల్గొన్న ప్రజలు దరూర్ షరీఫ్ చదువుతూ లాల్ మసీద్ రోడ్డులో మిఠాయిలు పంపిణీ చేశారు.
మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని
అనుసరించాలి
కర్నూలు రాజ్ విహార్ సెంటర్ వద్ద ఉన్న దర్గా ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారు. మత పెద్దలు ముక్దూమ్ సాహెబ్, అమ్మద్ నక్శ్‌బంది, సయ్యద్ మహ్మద్ సాహెబ్ ఖాద్రీ పీర్ తాహెరీ రిజ్వీ, సయ్యద్ దాదా బాషా ఖాద్రీ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ ముజంమిల్, డీఎస్పీ బాబుప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త జన్మించి 1500 సంవత్సరాలు పూర్తి అయ్యిందన్నారు. హింస, అరాచకాలు, రక్తపాతం, రాక్షసత్వం కలిగిన సమయంలో వాటిని నిర్మూలించేందుకు మహమ్మద్ ప్రవక్త జన్మించారన్నారు. తల్లి పాదాల చెంతే స్వర్గం ఉందని, తండ్రి ద్వారం లాంటి వాడని చెప్పారు. ఇదే రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువు గొప్పతనాన్ని కూడా వివరించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సెంట్రల్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీడ్రాలో విజేతలైన ముగ్గురికి ఉమ్రా టికెట్లు, ఐదు మందికి అజ్మీర్ షరీఫ్ యాత్ర టికెట్లను బహుమతిగా అందించారు.
శుభాకాంక్షలు తెలిపిన
వైఎస్సార్‌సీపీ నేతలు
మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని రాజ్ విహార్ సెంటర్‌లోని దర్గా ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలను తెలిపారు. నగరంలోని అన్ని మతాలు, వర్గాలకు చెందిన వారు ఐక్యంగా, సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఆధ్యాత్మికతను నింపిన
మిలాద్ – ఉన్ – నబీ
దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు
హాజరైన మేయర్ బీవై రామయ్య,
మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌వీ మోహన్‌రెడ్డి,
హఫీజ్‌ఖాన్

శాంతి.. ఐక్యత... భక్తి