
వైద్య విద్యార్థులకు అన్ని సౌకర్యాలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
గోస్పాడు: నంద్యాల మెడికల్ కళాశాలలోని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రూ.8.70 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోరిక మేరకు రైల్వే సీఎస్‌ఆర్ నిధులతో రూ.8.70 లక్షలతో ఆర్వో ప్లాంట్‌ను నిర్మించామన్నారు. మెడికల్ కళాశాల లోపల కేసీ కెనాల్ వెళ్తోందని ఆ ప్రాంతంలో పచ్చదనం, బెంచీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామనప్నారు. ఇందుకు రూ.40 లక్షల ఖర్చు చేసి పక్షం రోజుల లోపల పనులు పూర్తి చేస్తామన్నారు.
పెద్దాసుపత్రిలో...
నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన సమయంలో థైరాయిడ్ తదితర టెస్టులు నిర్వహించేందుకు, అవసరాలకు ఆర్వో ప్లాంట్ కావాలని అక్కడి వైద్యులు అడిగారని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.5.45 లక్షలతో ప్యూరిఫైడ్ వాటర్ సిస్టంను ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మెడికల్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.