
వదినను చంపిన మరిది
పగిడ్యాల: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో సొంత వదినను మరిది హత్య చేసిన ఘటన ఎం. ఘణపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శేఖర్ నాయక్, సుగాలి నాగమ్మ(60) నలుగురు పిల్లలు. వారంతా పెళ్ళిళ్లు చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 15 ఏళ్ల క్రితమే శేఖర్ నాయక్ మృతి చెందగా నాగమ్మ గ్రామంలో ఒక్కతే ఒంటరిగా ఉంటోంది. కాగా రైతుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆమె మరిది లోక నాయక్ అనుమానిస్తూ తరచూ హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె గురువారం ఉదయం తిరిగి చేరింది. ఇది పసిగట్టిన లోక నాయక్ ఆమెను అడ్డుకుని మందలించాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపోద్రేక్తుడైన అతను రాడ్‌తో తల వెనుక భాగంలో కొట్టగా వెంటనే అక్కడికక్కెడే కుళాయి పైప్‌లైన్‌పై పడిపోయి మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ తిరుపాలు, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతిపై స్థానికులను విచారించి ఆధారాల సేకరణకు క్లూస్ టీంను రప్పించారు. మృతురాలి మరో మరిది కుమారుడు చంద్రనాయక్ ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి స్టేషన్ ఏఎస్‌ఐ శేషయ్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి లోక నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు
● వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని..