
రేపటి నుంచి వేరుశనగ మార్కెట్ ప్రారంభం
● పైలట్ ప్రాజెక్టు కింద వారం రోజులపాటు పాసింగ్ లేకుండా కొనుగోలు
ఆదోని అర్బన్: పది రోజుల నుంచి ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో స్తంభించిన వేరుశనగకాయల క్రయవిక్రయాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం వ్యాపారస్తులు, కమీషన్ ఏజెంట్లు, యార్డు అధికారులతో సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యా యి. పైలట్ ప్రాజెక్టు కింద వారం రోజులపాటు పాసింగ్ లేకుండా వ్యాపారస్తులు టెండర్ వేసి కొనుగోలు చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో వ్యాపారస్తుల అసోసియేషన్ అధ్యక్షుడు శరణబసప్ప, సభ్యులు మస్తాన్‌వలి, నాగరాజు తదితరులు రైతులు తెచ్చిన వేరుశనగ దిగుబడులను ఆరబోస్తే తాము పరిశీలించి లాభసాటి అయిన ధరలను వేసుకుంటామని సబ్ కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో సబ్‌కలెక్టర్ రైతులకు నష్టం కలిగించకుండా చూడాలన్నారు. వారం రోజులపాటు పైలట్ ప్రాజెక్టు కింద పాసింగ్ లేకుండా వ్యాపారస్తులు కొనుగోలు చేయాలని, వారం రోజుల్లో ఏదైనా సమస్య వస్తే మళ్లీ చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఇందుకు వ్యాపారస్తులు ఒప్పుకున్నారు. సమావేశంలో యార్డు సెక్రటరీ కల్పన, అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్, సూపర్‌వైజర్‌లు, కమీషన్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, సభ్యులు రాజాగౌడ్, శ్రీరాములు, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.