
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని సోమప్పనగర్ సమీపంలోని లక్ష్మీనరసింహ కాలనీలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా తమ కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన బోయ రాజు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు వీరేంద్ర (19) ఆటో నడుపుతున్నాడు. ఎల్ల బీడు ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని గత కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నాడు. ఇదే విషయంపై చాలా సార్లు అమ్మాయి, అబ్బాయి కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీరేంద్ర తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లారు. అయితే ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న వీరేంద్రకు మంగళవారం రాత్రి అమ్మాయి తరుఫు వారు ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పి తీసుకెళ్లారని, దాడి చేసి చంపేసి, ఆ తర్వాత తమ ఇంటి సమీపంలో ఉన్న షెడ్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎల్ల బీడు ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారే తన కుమారుడిని చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద యువతితో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ ఉన్నాయని చెబుతున్నారు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.