
తొగలగల్లులో వ్యక్తి దారుణహత్య
ఆస్పరి: తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం (33) అనే వ్యక్తి బుధవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, ఆస్పరి సీఐ గంగాధర్ చెప్పిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన అహోబిలం అనే వ్యక్తి పక్కనే ఉన్న కలపరి గ్రామంలో వివాహం చేసుకున్నాడు. ఆ గ్రామంలో మాల పున్నమి పండగ ఉండడంతో బుధవారం ఉదయం భార్య పిల్లలతో కలిసి వెళ్లాడు. అక్కడే భార్యను విడిచి రాత్రి స్వగ్రామానికి కాలినడకన తిరిగి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో తొగలగల్లు – దొడగొండ గ్రామాల మధ్య గుర్తు తెలియని దుండగులు అహోబిలం గొంతు కోసి హత్య చేశారు. రోడ్డు పక్కన ఉన్న మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించడంతో హత్య వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి తొగలగల్లు గ్రామస్తులు తరలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడుకి భార్య గంగమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు.