మంత్రాలయం/కర్నూలు: అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువుల గుట్టు రట్టయ్యింది. విజిలెన్స్ దాడుల్లో రూ.6,39,800 విలువైన ఎరువులు సీజ్ చేసి, ఒక ఒక దుకాణంపై 6ఎ కేసు నమోదు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ప్యాపిలి ప్రాంతాల్లో మంగళవారం విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మంత్రాలయం మండలం కాచాపురం గ్రామంలోని శ్రీరామ్ ట్రేడర్స్, గురురాజ ట్రేడర్స్‌లో అక్రమంగా 300 బస్తాల యూరియా, 400 బస్తాల 20:20:0:13 రకం ఎరువులను నిల్వ చేశారు. మంగళవారం రాత్రి విజిలెన్స్ ఎస్‌ఐ వెంకట ప్రసాద్, డీసీటీఓ వెంకటరమణ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. రూ.79,800 విలువ జేసే యూరియా, రూ.5.60 విలువైన 20:20:0:13 ఎరువులను గుర్తించి సీజ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఓ వైపు యూరియా దొరక్క రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే హోల్‌సేల్ డీలర్ ఇంత మొత్తంలో యూరియాను నిల్వ ఉంచడం గమనార్హం. దాడుల్లో స్థానిక సీఐ రామాంజులు, మాధవరం ఎస్‌ఐ విజయ్‌కుమార్, వ్యవసాయాధికారి గణేష్, ఎంపీఈఓ బసవ పాల్గొన్నారు.