క్వింటా ఉల్లి రూ.1,200 ప్రకారం కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

క్వింటా ఉల్లి రూ.1,200 ప్రకారం కొనుగోలు చేయాలి

Sep 1 2025 3:07 AM | Updated on Sep 1 2025 3:07 AM

క్వింటా ఉల్లి రూ.1,200 ప్రకారం కొనుగోలు చేయాలి

క్వింటా ఉల్లి రూ.1,200 ప్రకారం కొనుగోలు చేయాలి

టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులను

ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా

కర్నూలు(సెంట్రల్‌): మార్క్‌ఫెడ్‌ ద్వారా క్వింటా ఉల్లిని రూ.1,200 ప్రకారం కొనుగోలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మార్కెటింగ్‌, హార్టికల్చర్‌, మార్క్‌ఫెడ్‌, మార్కెట్‌ యార్డు సెక్రటరీలతో ఉల్లి కొనుగోలుపై ఆదివారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆదివారం మార్కెట్లకు వచ్చిన ఉల్లి నిల్వలు, సోమవారం ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉందన్న వివరాలను తెలుసుకున్నారు. సోమవారం 1,200 నుంచి 1,500 క్వింటాళ్లు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని సెక్రటరీ వివరించారు. ఆదివారం నుంచే మార్కెట్‌కు వచ్చిన ఉల్లిని క్వింటా రూ.1200 ప్రకారం కొనుగోలు చేయాలని ఆదేశించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కోసిగి మార్కెట్లలో ఉల్లిని ఆరబెట్టుకునేందుకు తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్‌ బి.నవ్య, జిల్లా ఉద్యాన శాఖాధికారి రామాంజనేయులు, మార్క్‌ఫెడ్‌ డీఎం రాజు, మార్కెటింగ్‌ ఏడీ నారాయణమూర్తి, కర్నూలు మార్కెట్‌ సెక్రటరీ జయలక్ష్మి పాల్గొన్నారు.

కర్నూలు, పత్తికొండలలో ఉల్లి కొనుగోలు

కర్నూలు, పత్తికొండ మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.12 ప్రకారం ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయనున్నట్లు జేసీ డాక్టర్‌ బి.నవ్య తెలిపారు. ఆదివారం రాత్రి ఆమె కర్నూలు మార్కెట్‌ యార్డును సందర్శించారు. అక్కడ ఇద్దరు రైతులతో మాట్లాడారు. క్వింటా రూ.1200 ప్రకారం ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేస్తుందని చెప్పడంతో వారు అంగీకరించారు. అయితే నాణ్యత ప్రమాణాల మేరకు గ్రేడింగ్‌ చేసుకోవాలని సూచించారు. జేసీ వెంట మార్కెట్‌ సెక్రటరీ జయలక్ష్మీ, మార్కెటింగ్‌ ఏడీ నారాయణమూర్తి, మార్కెఫెడ్‌ డీడీ గద్వాల్‌ నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement