
‘ఉపాధి’ నిధులతో మ్యాజిక్ డ్రైన్‌లు
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్‌లు నిర్మించనున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 100 శాతం మ్యాజిక్ డ్రైన్‌లు నిర్మించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు సీసీ రోడ్డు వేస్తున్నారే కానీ డ్రైన్‌లు నిర్మించలేదు. ఇప్పుడు సీసీ రోడ్డు పక్కనే మ్యాజిక్ డ్రైన్‌లు నిర్మించనున్నారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో బెలగల్, సజ్జలగూడెం, ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో కనకవీడుపేట, ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలంలో సిద్దాపురం గ్రామాలను ఇందుకోసం ఎంపిక చేశారు. పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో గ్రామాలను ఎంపిక చేయాల్సి ఉంది.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
పోలింగ్ బూత్ ఏజెంట్లను నియమించుకోవాలి
కర్నూలు(సెంట్రల్): పోలింగ్ బూత్ ఏజెంట్లను రాజకీయ పార్టీలు త్వరగా నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబరులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు సమాయత్తం అవుతోందన్నారు. బూత్‌ల వారీగా ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. ఇప్పటికే ఎస్‌ఐఆర్ బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌ఓ)లకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 2,203 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రతి 1,200 మంది ఓటర్లకు ఒక్క పోలింగ్ కేంద్రం ఉండాలనే నిబంధనతో కొత్తగా 237 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, బీఎస్పీ నుంచి ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి అరుణ్‌కుమార్, టీడీపీ నుంచి ఆ పార్టీ నేత ఎల్‌వీ ప్రసాదు, కాంగ్రెస్ తరపున బజారన్న, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి పాల్గొన్నారు.
జిల్లా భూగర్భ జలవనరుల శాఖ డీడీగా సన్నన్న
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా భూగర్భ జలవన రుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా కె.సన్నన్నను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీడీగా విధులు నిర్వహిస్తున్న ఎం.శ్రీనివాసరావు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. ఖాళీ అవుతున్న ఈ పోస్టులో నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ గ్రౌండ్ వాటర్ డీడీగా విధులు నిర్వహిస్తున్న కె.సనన్న నియమితులయ్యారు. ఈయన ఉమ్మడి జిల్లాలోని కొలిమిగుండ్ల మండలానికి చెందిన వారు. ఈయన ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
డీఏఓకు ఆత్మ పీడీగా అదనపు బాధ్యతలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మికి జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు రత్నప్రసాద్ ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆన్‌డ్యూటీపై విధులు నిర్వహించారు. ఒరిజినల్‌గా ఒంగోలులో పనిచేస్తున్నారు. ఈయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో ఈ నెల 29న ఆత్మ పీడీ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఒంగోలుకు వెళ్లారు. ఖాళీ అయిన ఆత్మ పీడీ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి నియమితులయ్యారు.