
ఉల్లి సాగుతో అప్పులపాలు
మాకున్న ఎకర పొలంలో ఉల్లి పంట సాగు చేశాం. నార కొనుగోలుకు రూ.11వేలు, పొలాన్ని సిద్ధం చేసుకునేందుకు రూ.12వేలు.. నారు నాటేందుకు కూలీలకు రూ.12వేలు.. ఎరువులకు రూ.13వేలు, పొలంలో ఆరుసార్లు పురుగుమందుల పిచికారీకి రూ.10వేలు, పంట కోతకు రూ.15వేలు, హమాలీ ఇతర ఖర్చులు రూ.5వేల వరకు ఖర్చయింది. పొలంలో కుటుంబ సభ్యులు చేసిన పని లెక్కిస్తే మరో రూ.25వేలకు వరకు అవుతుంది. మొత్తంగా లక్ష రూపాయలకు పైనే పెట్టుబడి పెట్టాం. ఎకరాకు 120 బస్తాల ఉల్లి దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో బస్తా రూ.200 చొప్పున కొన్నారు. మొత్తం రూ.24వేలు చేతికొచ్చింది. ఈ లెక్కన రూ.80వేలకు పైగానే నష్టం. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు.
– బోయ రామాంజనేయులు,
మారందొడ్డి, ఉల్లి రైతు
బోరు కింద రెండెకరాల్లో రూ.లక్షన్నర ఖర్చు పెట్టుబడితో ఉల్లి పంట సాగు చేశా. పంట చేతికొచ్చినప్పటి నుంచి మార్కెట్లో ధర లేకుండా పోవడంతో ఉల్లి గడ్డలను కోయకుండా గత 20 రోజుల నుంచి పొలంలోనే వదిలేశా. ఇప్పుడు పొలంలో ఉన్న ఉల్లి గడ్డలను కోసి మార్కెట్‌కు తరలించాలన్న సుమారు రూ.50వేలకు పైగా ఖర్చు వస్తుంది. మార్కెట్‌లో క్వింటా ఉల్లి రూ.500 నుంచి రూ.600 మించి పలకడంలేదు. ఏమి చేయాలో పాలుపోక ఉల్లిగడ్డలను పొలంలో వదిలేసుకున్నా.
– రైతు వెంకటప్ప, వర్కూరు గ్రామం,
కోడుమూరు మండలం

ఉల్లి సాగుతో అప్పులపాలు