
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్లు రీ వెరిఫికేషన్
కర్నూలు(హాస్పిటల్): డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న దివ్యాంగ అభ్యర్థుల సర్టిఫికెట్లను శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రీ వెరిఫికేషన్ చేశారు. రీ వెరిఫికేషన్‌కు వైఎస్‌ఆర్ కడప జిల్లా నుంచి ఈఎన్‌టీ విభాగానికి 13 దరఖాస్తులు రాగా అందులో ఐదుగురు గైర్హాజరయ్యారు. అనంతపురం నుంచి ఆరుగురు హాజరు కాగా, కర్నూలు జిల్లా నుంచి 20 మందిలో ఇద్దరు గైర్హాజరయ్యారు. అలాగే ఆర్థోపెడిక్ విభాగంలో కర్నూలు జిల్లా నుంచి 28 మంది హాజరయ్యారు. సైకియాట్రి విభాగంలో కర్నూలు నుంచి ఒకరు, అనంతపురం జిల్లా నుంచి నలుగురు హాజరయ్యారు. కంటి ఆసుపత్రిలోనూ పలువురు అభ్యర్థుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌లో భాగంగా వైద్యులు పరీక్షించారు. ఈ ప్రక్రియను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు.