
ఇసుక ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి
సంజామల: పేరుసోముల గ్రామ సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద శనివారం తెల్లవారుజామున ఇసుక ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ రమణయ్య తెలిపిన వివరాల మేరకు...కొలిమిగుండ్ల మండలం బందారపల్లెకు చెందిన గోగుల సూర్యుడు(47) తాడిపత్రి నుంచి ఇసుక ట్రాక్టర్‌తో పేరుసోముల మీదుగా నంద్యాలకు తీసుకెళ్తున్నాడు. పేరుసోముల గ్రామం సమీపంలో ఉన్న పెద్దమ్మ గుడి వద్ద వేగాన్ని అదుపు చేయలేక ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సూర్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున ఇసుక ట్రాక్టర్ బోల్తాపడిన సంగతిని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బిల్లేకల్లు మార్కెట్ వేలం రూ.89.40 లక్షలు
ఆస్పరి: మండలంలోని బిల్లేకల్లు దినసరి కూరగాయలు మార్కెట్ వేలం రూ. 89.40 లక్షలు ధర పలికింది. శనివారం సర్పంచ్ శ్రీను ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి అంజినయ్య పంచాయతీ కార్యాలయం అవరణలో 2025–26 సంవత్సరానికి సంబంధించి దినసరి కూరగాయలు మార్కెట్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఐదుగురు పాటదారులు రూ. 5 లక్షలు సాల్వెన్సీ, రూ. 2 లక్షలు డిపాజిట్ చెల్లించి పాల్గొన్నారు. పోటాపోటీగా వేలం సాగింది. చివరకు బాట తిక్కయ్య అనే వ్యక్తి రూ.89.40 లక్షలు ఎక్కువ ధర వేలం పాడి మార్కెట్ హక్కులు దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 65 లక్షలు పలకగా, ఈసారి రూ. 89.40 లక్షలు పలకడంతో రూ. 29.40 లక్షలు పంచాయతీకి ఆదాయం వచ్చింది. వేలం నిర్వహణలో ఎంపీడీఓ గీతావాణి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆస్పరి సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు.

ఇసుక ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి