
పల్లెకు పోదాం.. సమస్యలు పరిష్కరిద్దాం
● జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
కల్లూరు: గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించేందుకే పల్లెకు పోదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. కల్లూరు మండలం పర్ల గ్రామంలో శనివారం పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓహెచ్‌ఎస్‌ఆర్, అంగన్‌వాడీ కేంద్రం, ఆస్పత్రి, గ్రామ సచివాలయం, సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు వేయాలని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని, కిచెన్ షెడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్ల నుంచి సింగవరం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు సూచించారు. సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నిర్మాణంలో ఆగిపోయిన భవనాలను పూర్తి చేస్తామన్నారు. బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. ఓవర్‌హెడ్ స్టోరేజ్ ట్యాంక్‌ను ప్రతి రోజు క్లోరినేషన్ చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈని ఆదేశించారు. క్లోరినేషన్ పరీక్షలకు గడువు తీరిన కిట్లను ఎందుకు వినియోగిస్తురాని ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరాలని ఎంపీడీఓను ఆదేశించా రు. పత్తి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎంపీడీఓ జీఎన్‌ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.