
పోలీసు శాఖకు నూతన ‘హంటర్’
● పేలుడు పదార్థాలను గుర్తించడంలో
దిట్ట అయిన జాగిలం
కర్నూలు: కేసుల ఛేదన, నేరస్తులను గుర్తించడంలో జిల్లా పోలీసు శాఖ మరింత బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం నూతన జాగిలాన్ని పంపింది. మంగళగిరి పోలీస్ హెడ్ క్వాటర్స్ ఆరో బెటాలియన్‌లో పది నెలల పాటు పేలుడు పదార్థాలపై ఈ కొత్త డాగ్ హంటర్ శిక్షణ పొంది శనివారం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది. ఇప్పటివరకు పోలీసు శాఖలో 8 జాగిలాలు ఉండగా హంటర్ రాకతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇది బెల్జియం మలనాయిస్ జాతికి చెందినది. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నూతన జాగిలాన్ని పరిశీలించారు. వాటి సంరక్షణపై డాగ్ స్క్వాడ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసుల ఛేదనలో జాగిలాలు కీలకపాత్ర పోషిస్తున్నందున వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డాగ్ స్క్వాడ్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వాటి సంరక్షణ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జావెద్, డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి ఏఆర్ కానిస్టేబుల్ రాజు, డాగ్ హ్యాండ్లర్ ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.