
అనుమానిత ఆంత్రాక్స్ కేసులపై విచారణ
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని శివన్న నగర్ ప్రాంతంలో ముగ్గురికి ఆంత్రాక్స్ అనుమానిత వ్యాధి లక్షణాలున్నాయన్న సమాచారంతో శనివారం అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యుటీ డైరెక్టర్ పీవీ రమణ, ఏడీ సుబ్రమాణ్యేశ్వర ఆచారి స్థానిక శివన్న నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌కు వచ్చి వైద్యాధికారిణి వీణతో మాట్లాడారు. అర్బన్ హెల్త్ సెంటర్‌కు ఎవరైనా వచ్చి ఆంత్రాక్స్ అనుమానిత లక్షణాలున్న వారు ప్రథమ చికిత్స చేయించుకున్నారా.. అని ఆరా తీయగా.. అలాంటి వారెవరూ చికిత్స చేయించుకోలేదని ఆమె వారికి తెలిపారు. అదేవిధంగా ఏఎన్‌ఎంలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. అంతకుమునుపు కందనాతి గ్రామంలో గొర్రెలను పరిశీలించారు. ఎమ్మిగనూరులో ఎలాంటి అనుమానిత ఆంత్రాక్స్ కేసులు నమోదు కాలేదని వైద్య సిబ్బంది చెప్పడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఊపిరి పీల్చుకొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గంగిరెడ్డిని కలిసి మాట్లాడారు. వారి వెంట పశుసంవర్ధక శాఖ వీఏఎస్ డాక్టర్ దినకర్, ఎంపీహెచ్‌ఈఓ విజయకృష్ణలు పాల్గొన్నారు.