
ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్
● 5, 6 తేదీల్లో భారీ వర్షాలు
కురిసే అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): రుతుపవనాల ప్రభావం వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 6 తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంతపురం వాతావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఈ నెల 5వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించిందని, 6వ తేదీన కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ ఉందన్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల ఆయా తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజుకు 64.5 నుంచి 115.5 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తారన్నారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీరిస్తారన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం 1100 నెంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లాకు 2,520 టన్నుల యూరియా
కర్నూలు(అగ్రికల్చర్): యూరియా కొరత నేపథ్యంలో జిల్లాకు కోరమాండల్ నుంచి 2,520 టన్నులు వచ్చింది. కర్నూలు ర్యాక్ పాయింట్ నుంచి యూరియా ఆయా ప్రాంతాలకు తరలించారు. ఇందులో 300 టన్నులు నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లోని ప్రయివేటు డీలర్లు, మన గ్రోమర్ సెంటర్లకు ఇచ్చారు. మిగిలిన యూరియాలో మార్క్‌ఫెడ్‌కు 1,260 టన్నులు, 960 టన్నులు ప్రయివేటు డీలర్లు, మన గ్రోమర్ సెంటర్లకు కేటాయించారు. ప్రయివేటు డీలర్లకు ఇచ్చిన యూరియాను బ్లాక్‌లో అమ్మేసినట్లు సమాచారం. గూడూరు, వెల్దుర్తి, సీ.బెళగల్, దేవనకొండ తదితర మండలాల్లో డీలర్లు జోరుగా బ్లాక్‌లో అమ్మకాలు సాగించినట్లు తెలుస్తోంది. మరోవైపు మార్క్‌ఫెడ్ నుంచి యూరియా పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్, రైతు సేవా కేంద్రాలకు వెళ్తోంది. దీనిని కూటమి పార్టీల నేతలు తరలించుకపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఒక్క రూపాయికే 30 రోజుల ఉచిత కాల్స్
కర్నూలు(హాస్పిటల్): బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఆజాద్ కా ఆఫర్ ద్వారా రూ.1కే 30 రోజుల పాటు ప్రతిరోజూ 2జీబీ డేటా చొప్పున ఉచిత కాల్స్, ఉచిత సిమ్ అందజేస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ జి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాత్రంత్య్ర దినోత్సవం మాసమైన ఆగస్టు నెలలో బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాద్ కా ఆఫర్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఇతర ఆపరేటర్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయిన వారికి కూడా నూతన ఆఫర్ వర్తిస్తుందన్నారు. వినియోగదారులు దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ సేవా కేంద్రాన్ని/రిటైలర్‌ను సందర్శించి ఈ ఉచిత ఆఫర్‌ను పొందాలన్నారు. 4జిని ప్రారంభించిన తర్వాత డేటా స్పీడులో మంచి వృద్ధి నమోదు చేసుకున్న తరుణంలో ఈ ఆఫర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమన్నారు.
‘కస్తుర్బా’ విద్యార్థినులకు అస్వస్థత
బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇద్దరు విద్యా ర్థినులు శనివారం అస్వస్థకు గురయ్యారు. బేతంచెర్లలోని జెండాపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని విజయలక్ష్మికి చేతులు కాళ్లు పట్టేసి ఆయాసం వచ్చింది. అలాగే 7వ తరగతి విద్యార్థిని నాగ భవానికి ఫిట్స్ వచ్చాయి. వీరికి స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్యం చేశారు. విషయం తెలిసి విద్యార్థి సంఘం నాయకులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. ఇదే విద్యాలయంలో గత నెలలో 9వ తరగతి విద్యార్థిని లలిత మాధురి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పోషకాహారం అందకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థులను 108 వాహనంలో కర్నూలుకు తరలించారు.