
కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న యూరియా కొరత
● మార్క్‌ఫెడ్‌లో బఫర్ స్టాక్
పశ్చిమ ప్రాంతానికే తరలింపు
● పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లపై
కూటమి నేతల పెత్తనం
● నిబంధనలకు విరుద్ధంగా
ప్రయివేట్ డీలర్లకు కేటాయింపులు
● బ్లాక్‌లో విక్రయించి
సొమ్ము చేసుకుంటున్న వైనం
● కర్నూలు ర్యాక్ పాయింట్ యూరియా
నంద్యాలకు..
● మండల కేంద్రాల్లో రైతుల పడిగాపులు
మాకు 30 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికే పత్తి, కంది సజ్జ తదితర పంటలు వేశాం. ఇటీవల వర్షాలు పడటంతో పత్తికి యూరియా అత్యవసరం. కాల్వలకు నీళ్లు వదలడం వల్ల వరి సాగుకు కూడా సిద్ధమవుతున్నాం. అయితే యూరియా దొరకని పరిస్థితి. జూలై నెలలో ఒక్క బస్తా కూడా అందుబాటులో లేదు. హొళగుంద మండలంలో ఏ ఒక్క ఆర్‌బీకేలో కూడా యూరియా లేదు. కర్ణాటకకు వెళ్లి రూ.400 ప్రకారం యూరియా తెచ్చుకుంటున్నాం.
– మలిగిరి మల్లికార్జున,
మాజీ సింగిల్‌విండో చైర్మన్, హొళగుంద
కాల్వలకు నీళ్లు వదలడంతో వరి సాగుకు సిద్ధమవుతున్నాం. 9 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఇంతవరకు వర్షాలు లేవు. ఇటీవలనే వర్షం కురిసింది. ఈ సమయంలో యూరియా వేస్తేనే పంట బాగా వస్తుంది. పది రోజులుగా యూరియా కోసం చేయని ప్రయత్నం లేదు. సొసైటీలకు వస్తున్న ఎరువులను పలుకుబడి కలిగిన వారు తరలించుకుపోతున్నారు. నాలాంటి సామాన్య రైతులు అన్ని పనులు వదులుకొని రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాం.
– మహబూబ్‌బాషా,
మల్యాల గ్రామం, నందికొట్కూరు మండలం
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వచ్చిన యూరియాలో 50 శాతం టీడీపీ నేతలు, మద్దతుదారుల తరలించుకుపోగా.. మిగిలిన అరకొర యూరియాను దక్కించుకునేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ వ్యయప్రయాసలకోర్చి మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్నా ఫలితం లేకపోతోంది. కూటమి ప్రభుత్వంలో రైతుల దీనావస్థలకు యూరియా కొరత అద్దం పడుతోంది. కర్నూలు జిల్లాకు సంబంధించి మార్కఫెడ్‌లో 5వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్‌లో ఉండాలి. ఇలా ఉంటే ఏ ప్రాంతంలో కొరత ఉంటే అక్కడకు సరఫరా చేసే వీలుంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్క్‌ఫెడ్‌లో యూరియా బఫర్ అనేది లేకుండా పోయింది. ఇప్పటి వరకు బఫర్‌లో ఉన్న యూరియాను వ్యవసాయ శాఖ ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్‌లకు ఇస్తున్నారు. మార్క్‌ఫెడ్‌లోని బఫర్ స్టాక్ మొత్తం పశ్చిమ ప్రాంతానికి తరలించినప్పటికీ కొరత కొనసాగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు రోజుల తరబడి ఆర్‌బీకేలు, డీసీఎంఎస్, పీఏసీఎస్‌లకు చుట్టు తిరగాల్సి వస్తోంది. ఆదోని, కౌతాళం, ఆలూరు, హొళగుంద, పెద్దకడుబూరు, దేవనకొండ, ఎమ్మిగనూరు, హాలహర్వి మండలాల్లో యూరియా కోసం నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నారు. తుంగభద్ర తీరం వెంట వరి సాగు మొదలవుతుండటం వల్ల యూరియాకు డిమాండ్ ఏర్పడింది. అయితే మార్క్‌ఫెడ్‌లో యూరియా అనేదే లేకపోవడంతో రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుంది. నంద్యాల జిల్లాకు సంబంధించి మార్క్‌ఫెడ్‌లో జూలై మొదట్లో 9వేల టన్నుల యూరియా నేడు 1500 టన్నులకు పడిపోయింది. నంద్యాల జిల్లాకు జూలై నెలలో ఒక్క ర్యాక్ కూడా రాలేదు. ఇందువల్ల మార్క్‌ఫెడ్‌లో ఉన్న యూరియా క్రమంగా ఖాళీ అవుతోంది. యూరియా కోసం నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఆత్మకూరు, కొత్తపల్లి, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో కొద్ది రోజులుగా రైతులు పోరాటం చేయాల్సి వస్తోంది.
నిబంధనలకు పాతర
జిల్లాకు వచ్చే యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువుల్లో నిబంధనల ప్రకారం 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, 50 శాతం ప్రయివేటు డీలర్లకు ఇవ్వాల్సి ఉంది. అలా చేసినప్పుడే అత్యవసరం ఉన్న ప్రాంతాలకు కేటాయింపులు చేపట్టి కొరతను నివారించవచ్చు. ఇటీవల ఆర్‌సీఎఫ్ కంపెనీకి చెందిన 1500 టన్నుల యూరియా కర్నూలు ర్యాక్‌పాయింట్‌కు వచ్చింది. ఇందులో 50 శాతం మార్కఫెడ్‌కు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క టన్ను కూడా ఇవ్వలేదు. మొత్తం 1500 టన్నుల యూరియాను వ్యవసాయ యంత్రాంగం ప్రయివేటు డీలర్లేకే ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ప్రయివేటు డీలర్లకు కేటాయించిన విషయం కూడా బయటకు పొక్కనివ్వకపోవడం గమనార్హం. ఈ యూరియా మొత్తాన్ని ప్రయివేటు డీలర్లు బ్లాక్‌లో సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.
పడిగాపులు కాస్తున్నాం

కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం

కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం