జిల్లాలో పెరిగిన ఈదురు గాలుల తీవ్రత | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పెరిగిన ఈదురు గాలుల తీవ్రత

Jul 24 2025 7:40 AM | Updated on Jul 24 2025 7:40 AM

జిల్లాలో పెరిగిన ఈదురు గాలుల తీవ్రత

జిల్లాలో పెరిగిన ఈదురు గాలుల తీవ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో వర్షాలు అంతంతమాత్రం పడుతుండగా ఈదురు గాలుల తీవ్రత పెరిగింది. చలితో కూడిన ఈదురు గాలులతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 9 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చిప్పగిరిలో 18.6 మి.మీ., హాలహర్విలో 16.4, హొళగుందలో 7.4, మద్దికెరలో 7.2, ఆలూరులో 4.6, పత్తికొండలో 3.2, ఆదోనిలో 1,6, కౌతాళంలో 0.8, తుగ్గలిలో 0.4 మి.మీ ప్రకారం వర్షం కురిసింది. జూలై నెల సాధారణ వర్షపాతం 90.7 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 67 మి.మీ వర్షపాతం నమోదైంది. రానున్న నాలుగైదు రోజుల్లో కూడా ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 2.19 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వర్షాలు అంతంతమాత్రం కావడంతో పంటల్లో ఎదుగుదల లోపించింది.

2న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు ఆగస్టు 2న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఈ సమావేశాలను ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య , వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష చేపడతామన్నారు. సమావేశాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలని సీఈఓ కోరారు.

ఐదు పంపులతో ‘హంద్రీ–నీవా’కు నీరు

కర్నూలు సిటీ: హంద్రీ– నీవా సుజల స్రవంతి పథకం కాలువకు నీటి విడుదలను బుధవారం పెంచారు. మల్యాల నుంచి ఐదు పంపులతో కాలువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ నెల 17న సీఎం చంద్రబాబు నాయుడు మల్యాల దగ్గర మోటర్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. ఆ రోజున మొదటగా 3 పంపులు ద్వారా 1013 క్యుసెక్కుల నీటిని పంపింగ్‌ చేశారు. మంగళవారం మరో మోటర్‌ను పెంచి అదనంగా 337 క్యుసెక్కుల నీటిని పెంచి, బుధవారం మరో మోటర్‌ను ఆన్‌ చేసి, మొత్తం 5 మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. కృష్ణా జలాలు బుధవారం రాత్రికి అనంతపురం జిల్లాలోని జీడీపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్నట్లు హంద్రీనీవా ఇంజినీర్లు తెలిపారు.

సెప్టెంబర్‌ 4న

గణేశ్‌ నిమజ్జనోత్సవం

కర్నూలు కల్చరల్‌: వినాయక చవితి ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని గణేష్‌ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి.వేణుగోపాల్‌, గోరంట్ల రమణ తెలిపారు. కర్నూలు నగరంలో 9వ రోజు సెప్టెంబర్‌ 4వ తేదీన వినాయక విగ్రహాల నిమజ్జనం ఉంటుందని పేర్కొన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, గూడూరు, కోడుమూరు తదితర ప్రాంతాల్లో 5వ రోజు ఆగస్టు 31వ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. స్థానిక ఉత్సవ సమితుల కార్యకర్తలు గమనించాలని విజ్ఙప్తి చేశారు.

‘డీబీటీకి ప్రత్యేక ఖాతాలు అవసరం లేదు’

కర్నూలు(అగ్రికల్చర్‌): డీబీటీ కోసం మళ్లీ బ్యాంకుల్లో ఖాతా తెరవాల్సిన అవసరం లేదని ఎల్‌డీఎం రామచంద్రరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ బ్యాంకులోనైనా ఇప్పటికే ఖాతా ఉన్న వారు తమ ఆధార్‌ను ఎన్‌పీసీఐలో మ్యాపింగ్‌ చేయించుకుంటే సరిపోతుందన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంక్‌ శాఖల్లో ఆధార్‌ నెంబర్‌తో ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను లింక్‌ చేయించుకొని డీబీటీ ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చన్నారు. కొంతమంది ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వాటిని నమ్మవద్దని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement